Telangana Tourism: తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్.. 34 జలవనరుల్లో స్పీడ్, హౌస్‌బోట్లు
తెలంగాణ రాష్ట్రంలోని నదుల బ్యాక్‌వాటర్లు, రిజర్వాయర్లు, చెరువులను సాహస జల క్రీడల కోసం ఆకర్షణీయమైన వేదికలుగా మారుస్తున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించింది. ఈ లక్ష్యంతో, 34 జలవనరులను బోటు షికారు సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో (పీపీపీ) ఈ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. మొదటగా, హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్, సోమశిలలోని కృష్ణా నది బ్యాక్‌వాటర్‌లలో సరికొత్త బోటింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ రెండు ప్రదేశాల్లో టెండర్ల ప్రక్రియ ముగిసిన తర్వాత, ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. డిసెంబరు 4నుంచి స్పీడ్ బోట్లు, ఇతర సాహస జలక్రీడలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ వర్గాలు తెలిపాయి.
పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు అందించే ప్రణాళికలు
రాష్ట్రవ్యాప్తంగా జలపర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు, పలు జిల్లాల్లో వాటర్ స్పోర్ట్స్ కార్యక్రమాలను ప్రవేశపెట్టేందుకు టూరిజం సంస్థ జలవనరులను ఎంపిక చేసింది. హుస్సేన్‌సాగర్, సోమశిల, కరీంనగర్ లోయర్‌మానేరు డ్యాం, రామప్ప చెరువు, లకారం, మధిర చెరువులు, నాగార్జునసాగర్‌లో కృష్ణా నది (హౌస్‌బోట్), బుద్ధవనం వద్ద కృష్ణా నది (హౌస్‌బోట్), గోదావరిఖని వద్ద గోదావరి నది, మహబూబ్‌నగర్, సిద్దిపేట కోమటిచెరువు, భద్రకాళి చెరువు, కోటిపల్లి రిజర్వాయర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్, కడెం రిజర్వాయర్ వంటి వివిధ జలాశయాలను జాబితాలో చేర్చారు. ఈ ప్రదేశాల్లో స్పీడ్ బోట్లు, డీలక్స్ బోట్లు, హౌస్‌బోట్లు, అలాగే పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు అందించే ప్రణాళికలు ఉన్నాయి.
జమలాపురం చెరువు వద్ద పర్యాటకుల సౌకర్యాల కోసం టెండర్లు
ఖమ్మం జిల్లాలో మధిర వద్ద జలక్రీడలతో పాటు కాటేజీలు, రెస్టారెంట్లు, పిల్లలు ఆడుకునే పరికరాల ఏర్పాటు కోసం టెండర్లు పిలిచారు. సంగారెడ్డి జిల్లా సింగూరు రిజర్వాయర్‌లో 25-30 మంది ప్రయాణించేలా డీలక్స్ బోట్లు, కాటేజీలు, కెఫెటేరియా, ఓపెన్ జిమ్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఖమ్మం జిల్లాలో జమలాపురం చెరువు వద్ద కూడా పర్యాటకుల సౌకర్యాల కోసం టెండర్లు పిలిచారు. 20, 40 సీట్లతో బోట్లు, కాటేజీల నిర్మాణం చేపట్టేందుకు టెండర్లు ఏర్పాటు చేశారు.