
#NewsBytesExplainer: తెలంగాణలో యూరియా కొరత.. యూరియాపై రాజకీయాలు.. పొంచి ఉన్న బ్లాక్ మార్కెట్ దందా!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో యూరియా కోసం రైతుల పోరాటం తీవ్రమవుతోంది. రాజకీయ పార్టీల మద్దతు వల్ల రైతుల ఆందోళనలలు మరింత సెగలుగక్కుతోంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్డెక్కి యూరియా కోసం నిరసనలు చేపట్టారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల నిరసనలు తీవ్రంగా కనిపించాయి. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖానాపురంలో, పోలీసుల అడ్డుకోవడంతో మహిళా రైతులు కాళ్లుపట్టుకునే దృశ్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీటితోపాటు, రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు రైతులపై తమ ప్రేమను ప్రదర్శిస్తున్నారు. ప్రత్యక్ష మద్దతు తెలిపిన తర్వాత ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. వ్యవసాయ నిపుణులు రైతులు రసాయన ఎరువులు తగ్గించాల్సిన అవసరం ఉందని పదేపదే చెబుతున్నారు.
వివరాలు
యూరియాకు పెరుగుతున్న డిమాండ్
కానీ ఈ హితబోధలు పెద్దగా ఫలితాలు ఇవ్వలేదని, రైతులను సమయానికి చైతన్యం చేయడంలో నిర్లక్ష్యం నిర్లక్ష్యం కనిపిస్తోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతంలో వర్షాకాలం సీజన్ పీక్ దశలో ఉంది. సీజన్ ప్రారంభంలో వర్షాలు ఆలస్యమైనా ఇప్పుడు మళ్ళీ వర్షాలతో వ్యవసాయ పనులు తిరిగి జోరందుకున్నాయి. దీని కారణంగా యూరియాకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఒకవైపు డిమాండ్,మరోవైపు కొరత కారణంగా రైతులు పనులను పక్కనపెట్టి 'యూరియా' కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. వ్యవసాయ పనులు సక్రమంగా జరిగేందుకు యూరియా తప్పనిసరి. ఎరువుల దుకాణాల్లో స్టాక్ లేకపోవడం, సహకార సంఘాలు, ఆగ్రోస్ ద్వారా రేషన్ తరహాలో పంపిణీ జరుగుతున్నప్పటికీ, ప్రతి రైతుకీ కావలసిన యూరియా లభిస్తుందా? అంటే గ్యారంటీ లేదు.
వివరాలు
యూరియాకు పెరుగుతున్న డిమాండ్
ఫలితంగా, రైతులు బారులు తీరుతుండగా లైనులో నిలబడలేక లైన్‌లో పాస్‌బుక్‌లు,సంచులు, చెప్పులు వంటివి క్యూలో పెడుతున్నారు. జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో ఉన్నా, కొరత ఉందన్న ప్రచారం వల్ల కొంత మంది రైతులు ముందస్తు జాగ్రత్త తీసుకున్నప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు నిన్నమొన్నటి వరకు తెరవెనుక ఉండగా తాజాగా వారికి మద్ధతుగా ఆందోళనల్లో పాల్గొనడంతో పరిస్థితి పలుచోట్ల ఉద్రిక్తంగా మారింది. ఖానాపురం, ఉప్పరపల్లి, దంతాలపల్లి, రాయపర్తి, జనగామ, పరకాల, మహబూబాబాద్ ప్రాంతాల్లో రైతులు యూరియా కోసం ఆందోళనలు నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకుల ప్రత్యక్ష మద్దతుతో, రైతులు యూరియా కోసం వేచిచూస్తున్న ప్రాంతాలకు వచ్చి ఆందోళనలు చేపట్టడంతో పలుచోట్ల భారీగా పోలీసులు మోహరించారు. రాజకీయ మద్దతు కారణంగా,ఆందోళనతో ఉన్న రైతుల్లో ఆగ్రహం మరింత పెరుగుతోంది.
వివరాలు
రాజకీయ మూడు ముక్కలాట
రాష్ట్రంలో యూరియా సమస్యపై రాజకీయ మూడు ముక్కలాట సాగుతోందని అనేకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కాంగ్రెస్ పైన కక్షపూరిత చర్యలు తీసుకోవడం వల్ల యూరియా కొరత ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్, మంత్రులు తుమ్మల,కేంద్రాన్నితీవ్రంగా విమర్శిస్తున్నారు. రాష్ట్రానికి అప్పటికే రావాల్సిన 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు కేవలం 5.32 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరానే అందింది. దీని కారణంగా, రాష్ట్ర రైతులకు తక్షణం అవసరమైన 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వెంటనే సరఫరా చేయాలని కోరుతున్నారు. పార్లమెంటులో ఎంపీలు కూడా ఈ సమస్యపై నిరసనలు చేపట్టారు. యూరియా కొరతను బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని, బీజేపీకి తాబేదారుగా మారిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
వివరాలు
బ్లాక్ మార్కెట్ పడగనీడ
కేంద్రాన్ని ప్రశ్నించకుండా బీఆర్ఎస్, బీజేపీ తమను టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. కేంద్రం నుంచి యూరియా సరఫరాకు సానుకూల స్పందన లభించిందని మంత్రి తుమ్మల ప్రకటనతో రైతులకు కొంత ఊరట లభించింది. త్వరలో కర్ణాటక,ఇతర రాష్ట్రాల నుండి యూరియా రాబోతుందని ప్రకటించారు. కానీ పంపిణీపై కట్టుదిట్టమైన చర్యలు లేకపోతే బ్లాక్ మార్కెట్ దారుల దందా ప్రారంభమయ్యే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీజన్ కారణంగా డిమాండ్ ఎక్కువగా ఉన్నందున,అధికారులు,పోలీసుల పర్యవేక్షణలో సరైన పంపిణీ కోసం చర్యలు తీసుకుంటే మాత్రమే సత్ఫలితం సాధ్యమని రైతులు చెబుతున్నారు. లేదంటే కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మే సూచనలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు.