
Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన
ఈ వార్తాకథనం ఏంటి
నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశమున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ద్రోణిగా మారి, అది మధ్య కోస్తా ఆంధ్ర తీరం వరకూ విస్తరించినట్లు పేర్కొంది. ఈ ద్రోణి సముద్రమట్టానికి సుమారు 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని వివరించింది. ఈ ద్రోణి మరింత ఎత్తుకు వెళ్ళే కొద్దీ, అది నైరుతి దిశగా విస్తరించే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
వివరాలు
రాష్ట్రంలోని గరిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం
ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోల్చితే మూడు నుంచి ఐదు డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా ముందుకు కదిలే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాల వరకు విస్తరించవచ్చని వివరించింది.
వివరాలు
హైదరాబాద్ నగరంలో చిరుజల్లులు పడే సూచనలు
ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా జోగులాంబ గద్వాల, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ నగరంలో చిరుజల్లులు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వివరించింది.