Telangana: నెమలి కూరను వండి.. యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసిన సిరిసిల్ల వాసి
తెలంగాణలో నెమలి కూర తయారు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన యూట్యూబర్‌పై కేసు నమోదైంది. సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రణయ్ కుమార్‌పై ఈ చర్య తీసుకున్నారు.యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియో డిలీట్ చేశారు. కోడం ప్రణయ్ కుమార్ ఈ వీడియోను యూట్యూబ్‌లో 'సాంప్రదాయ నెమలి కూర' పేరుతో షేర్ చేశారు. వీడియోను తొలగించినప్పటికీ, జంతు హక్కుల కార్యకర్తలు ప్రణయ్ కుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా, నిందితుడు అడవి పందిని వేటాడి దాని నుండి కూరను తయారు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రణయ్‌కుమార్‌పై కేసు నమోదు చేశామని,ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
నెమలి మాంసంతో పట్టుబడ్డ ఇద్దరు రైతులు
వీడియో వైరల్ కావడంతో పరారీలో ఉన్న ప్రణయ్ కుమార్‌ను తెలంగాణ పోలీసులు సుదీర్ఘ సోదాల తర్వాత ఆదివారం అరెస్టు చేశారు. అతను నెమలి కూర తయారు చేసిన ప్రదేశాన్ని కూడా పోలీసులు పరిశీలించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నెమలి షెడ్యూల్ 1 కిందకు వస్తుంది. నెమలిని చంపడం శిక్షార్హమైన నేరం, కనిష్టంగా మూడేళ్లు గరిష్టంగా ఏడేళ్ల జైలుశిక్ష. అంతకుముందు జూన్‌లో తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఇద్దరు రైతులు నెమలి మాంసంతో పట్టుబడ్డారు. పొలంలో పెద్దఎత్తున నెమలి ఈకలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో అటవీశాఖ అధికారులకు ఈ విషయం తెలిసింది. పొలంలో విద్యుత్ తీగ తగిలి మృతి చెందిన నెమలిని కూరను వండి పెట్టినట్లు రైతులు పోలీసులకు తెలిపారు.