Chandrababu: 'కమ్మ సామాజికవర్గానికి మద్ధతు లేఖ నకిలీదే.. చంద్రబాబుపై దుష్ప్రచారం జరుగుతోంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో కులాల కుమ్ములాటలు మరోసారి పురివిప్పుకుంటున్నాయి. ఈ మేరకు 'ఒక సామాజికవర్గ ప్రజలకు విజ్ఞప్తి' అంటూ చంద్రబాబు నాయుడు పేరుతో విడుదలైన ఓ నకిలీ లేఖను సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ దుయ్యబట్టింది. రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను ఎగేయడం, రెచ్చగొట్టడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైజమని టీడీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. వైఎస్సాఆర్ సీపీ పార్టీ ఓటమి భయం, వైఎస్ జగన్ కు ఏ స్థాయిలో కనిపిస్తుందో ఈ నకిలీ లేఖ చెబుతోందని ఎద్దేవా చేసింది.
కమ్మ సామాజికవర్గానికి చంద్రబాబు లేఖ ఫేక్ : అచ్చెన్నా
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కమ్మ సామాజికవర్గానికి చంద్రబాబు లేఖ రాసినట్లు ఒక ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే దానిపై స్పందించిన ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, అది నకిలీ లేఖ అన్నారు. దాన్ని ఎవరూ నమ్మవద్దు అని కోరారు. తెలంగాణ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.తమ పార్టీ అధినేత చంద్రబాబు ఎవరికి ఓటేయాలనే విషయంలో పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఎటువంటి సూచనలు చేయలేదన్నారు. చంద్రబాబు పేరును దెబ్బతీసేందుకు వైఎస్సార్‌సీపీ చేసిన కుట్ర అని అచ్చెన్నా అభివర్ణించారు. వైఎస్సార్‌సీపీ బతుకే ఫేక్ బతుకు అన్నారు. ఫేక్ లేఖలనే ఆ పార్టీ నమ్ముకుందని, చంద్రబాబు సంతకాన్ని ఫోర్జరీ చేసిన అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.