యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు విజయకేతనం ఎగురేశారు. దాదాపు 40మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. తాజాగా యూపీఎస్‌సీ ర్యాంకులు సాధించిన వాళ్లలో చాలా మంది ఐఐటీల నుంచి గ్రాడ్యుయేట్లే కావడం గమనార్హం. తెలంగాణకు చెందిన ఉమా హారతి ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించారు. నారాయణపేట జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్.వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి. తిరుపతికి చెందిన పవన్ దత్తా 22వ ర్యాంక్ సాధించగా, తరుణ్ పట్నాయక్ 33వ ర్యాంక్ సాధించాడు. తరుణ్ తండ్రి ఎంఆర్కే పట్నాయక్ రాజమండ్రిలోని జక్కంపూడి ఫౌండేషన్‌కు ట్రస్టీగా ఉన్నారు. ప్రస్తుతం సిమ్లాలోని ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్‌లో ట్రైనీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
అజ్మీరా సంకేత్ కుమార్‌కు 35వ ర్యాంకు
మంచిర్యాల దండేపల్లి మండలం కర్ణపేట్ గ్రామానికి చెందిన అజ్మీరా సంకేత్ కుమార్ 35వ ర్యాంకు సాధించాడు. అతని తండ్రి ప్రేమసింగ్ నాయక్ హైదరాబాద్‌లోని ఉద్యానవన శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్. హన్మకొండ జిల్లాలోని అడ్వకేట్స్ కాలనీకి చెందిన శాకమూరి సాయి హర్షిత్ మొదటి ప్రయత్నంలో 40వ ర్యాంకు సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన రిచా కులకర్ణి 54వ ర్యాంకు, హెచ్‌ఎస్ భావన 55వ ర్యాంక్, గుంటూరుకు చెందిన సాయి ప్రణవ్ 60వ ర్యాంక్ సాధించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌కు చెందిన ఏనుగు శివమారుతిరెడ్డి రెండో ప్రయత్నంలో 132వ ర్యాంకు సాధించాడు. అతని తండ్రి అంజిరెడ్డి మల్లాపూర్ మానాల గుండంపల్లిలో స్కూల్ అసిస్టెంట్. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బి.వినూత్న 462వ ర్యాంకు సాధించింది.
భళా రేవయ్య! వంట మనిషి కొడుకు సివిల్స్ ర్యాంకర్
నిరుపేద దళిత కుటుంబానికి చెందిన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఐఐటీ-మద్రాస్ పూర్వ విద్యార్థి డోంగ్రే రేవయ్య 410వ ర్యాంకు సాధించాడు. రేవయ్య ప్రభుత్వ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో చదువుకున్నాడు. కష్టపడి చదివి సివిల్స్ ర్యాంకు సాధించాడు. అతని తల్లి విస్తరుబాయి వారి స్వగ్రామమైన రెబ్బెన మండలం తుంగెడలో మధ్యాహ్న భోజన పథకంలో వంట మనిషిగా పని చేస్తుంది. రేవయ్య చిన్నతనంలోనే అతని తండ్రి చనిపోయాడు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం బాలరావుపేటకు చెందిన రామదేని సాయినాథ్ 742వ ర్యాంకు సాధించాడు. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో చదివిన విద్యార్థి, జనగాం జిల్లాకు చెందిన కొయ్యడ ప్రణయ్ కుమార్ తన మొదటి ప్రయత్నంలోనే 885 ర్యాంక్ సాధించాడు.