
Export: భారత ఎగుమతుల్లో దూసుకెళుతున్న గుజరాత్.. తెలుగు రాష్ట్రాలకు 6, 7 స్థానాలు
ఈ వార్తాకథనం ఏంటి
గత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తంగా చేసిన ఎగుమతుల విలువ రూ.37.02 లక్షల కోట్లు (అంటే సుమారు 437.42 బిలియన్ డాలర్లు) అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) వెల్లడించింది. ఈ మొత్తంలో గుజరాత్ రాష్ట్రం రూ.9.83 లక్షల కోట్ల విలువైన (116.33 బిలియన్ డాలర్లు) ఎగుమతులతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది దేశ ఎగుమతులలో 26.6 శాతం వాటాను సూచిస్తోంది. దీనికి ముఖ్య కారణం, గుజరాత్‌లోని జామ్‌నగర్ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో పెట్రోలియం, రిఫైనరీ ఉత్పత్తుల రవాణా జరగడమే. అక్కడి నుంచి రూ.3.63 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు విదేశాలకు వెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో 15.45 శాతం మత్స్య ఉత్పత్తులు
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు దేశవ్యాప్తంగా వరుసగా ఆరు,ఏడు స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో 24.40 శాతం వాటా అమెరికా దేశానికే వెళ్లింది. తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్ళిన సరుకుల్లో 23.60 శాతం అమెరికా మార్కెట్‌ను టార్గెట్ చేశాయి. తెలంగాణ ఎగుమతుల్లో ఎక్కువగా ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్‌ల విడిభాగాలు (29.47 శాతం), ఔషధ ఉత్పత్తులు, బయోలాజిక్స్ (26.80 శాతం) ఉన్నాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో 15.45 శాతం మత్స్య ఉత్పత్తులు, 10.38 శాతం ఔషధాల ఫార్ములేషన్లు, బయోలాజిక్స్ ఉన్నట్లు సమాచారం.