
Hyderabad: హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన తేమ శాతం.. రాష్ట్రవ్యాప్తంగా నేడు అధిక ఉష్ణోగ్రతలు
ఈ వార్తాకథనం ఏంటి
మాడు పగిలే ఎండలతో తెలంగాణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భానుడి భగభగలతో ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఇంతకుముందెన్నడూ లేని విధంగా, ఫిబ్రవరి ప్రారంభం నుంచే సూర్యుడు తీవ్ర ఉష్ణాన్ని విడుదల చేస్తోంది.
మార్చి మూడో వారంలో ఐదు రోజుల పాటు స్వల్పంగా వర్షాలు కురిసి వాతావరణం కొంత చల్లబడినా, మళ్లీ భానుడి భగభగలు పెరిగాయి.
వివరాలు
హైదరాబాద్‌లో అత్యంత తీవ్రమైన వేడి
తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో తీవ్ర వేడితో ప్రజలు అల్లాడిపోయారు.
ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నా, తేమ శాతం మెరుగుగా ఉంటే కొంత చల్లదనం అనిపిస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
కానీ, తేమ శాతం తగ్గిపోతే, ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నా కూడా మరింత వేడిగా అనిపిస్తుందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే, హైదరాబాద్‌లో అత్యంత తీవ్రమైన వేడి కొనసాగింది.
నగర గాలిలో తేమ శాతం కేవలం 26గా నమోదయింది. ఆదివారం సాధారణం కంటే 1 డిగ్రీ అధికంగా 38.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది, దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మండే ఎండలు, విపరీతమైన ఉక్కపోత ప్రజలను గడగడలాడించాయి.
వివరాలు
పర్యావరణ మార్పులు ప్రధాన కారణం
అదే సమయంలో, ఆదిలాబాద్‌లో గాలిలో తేమ శాతం 27గా, మహబూబ్‌నగర్‌లో 30, నల్గొండలో 31, భద్రాచలంలో 35, ఖమ్మంలో 41, హనుమకొండ-రామగుండం ప్రాంతాల్లో 44, నిజామాబాద్‌లో 46 శాతంగా నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గాలిలో తేమ శాతం తగ్గిపోవడానికి పర్యావరణ మార్పులు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
చెట్ల సంఖ్య తగ్గడం, కాలుష్యం పెరగడం, నీటి వనరులు తగ్గిపోవడం వంటి అంశాలు దీనికి దోహదం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఆదిలాబాద్‌లో ఆదివారం పగటిపూట ఉష్ణోగ్రత 41.8 డిగ్రీలుగా నమోదయింది, ఇది సాధారణం కంటే 2.9 డిగ్రీల అధికం.
వివరాలు
నేడు పెరగనున్న ఉష్ణోగ్రతలు
నేడు (సోమవారం) అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు.
తేలికపాటి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు, మజ్జిగ వంటి శీతలపదార్థాలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.