
Telangana High Court: హైకోర్టులో ఉద్రిక్త వాతావరణం.. న్యాయమూర్తిపై కక్షిదారు దురుసు ప్రవర్తన!
ఈ వార్తాకథనం ఏంటి
హైకోర్టులో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రివ్యూ పిటిషన్‌లో తీర్పు వెలువరించలేదని కోర్టు హాలులోనే న్యాయమూర్తిపై కక్షిదారు దురుసుగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళ్తే, అంబర్‌పేటకు చెందిన బి. చెన్నకృష్ణారెడ్డి ఒక సివిల్ వివాదంపై హైకోర్టులో అప్పీలు దాఖలు చేసి స్టే ఆదేశాలు పొందారు. అయితే 18 సంవత్సరాల తర్వాత ఈ కేసును జస్టిస్ నగేశ్ భీమపాక విచారించి అప్పీలును కొట్టివేశారు. దీంతో కక్షిదారు మరోసారి రివ్యూ పిటిషన్ వేశారు. ఇటీవల చెన్నకృష్ణారెడ్డి అనుమతి లేకుండా నేరుగా జస్టిస్ నగేశ్ భీమపాక ఛాంబర్‌లోకి వెళ్లి, 'అప్పీల్‌ను ఎలా కొట్టివేస్తారు? రివ్యూ పిటిషన్‌లో ఎందుకు తీర్పు ఇవ్వరంటూ ప్రశ్నించారు.
Details
వయస్సు రీత్యా దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించడం లేదు
దీనిపై జస్టిస్ భీమపాక, న్యాయమూర్తి ఛాంబర్‌లోకి రాకూడదని, అలాగే కేసు విషయమై నేరుగా మాట్లాడకూడదని హెచ్చరించినా.. కక్షిదారు దురుసుగా ప్రవర్తించారని సమాచారం. దీంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కేసును ఓపెన్ కోర్టులో విచారిస్తానని ఆయనను బయటికి పంపించారు. గురువారం జరిగిన విచారణలోనూ చెన్నకృష్ణారెడ్డి కోర్టులోనే న్యాయమూర్తిని ప్రశ్నిస్తూ, 'నా రివ్యూ పిటిషన్‌లో ఎందుకు ఉత్తర్వులు ఇవ్వరంటూ బెదిరింపు ధోరణిలో ప్రవర్తించారు. దీనిపై జస్టిస్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కక్షిదారి వయస్సు రీత్యా దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించడం లేదని, అయితే తాను ఈ కేసు విచారణ నుంచి వైదొలుగుతున్నానని స్పష్టం చేశారు. అలాగే ఈ ఫైలును ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.