
India-Pakistan: పహల్గాం ఘటన.. అమృత్‌సర్ సరిహద్దులో ఉగ్రవాద కుట్ర భగ్నం, భారీగా ఆయుధాలు స్వాధీనం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద మరోసారి ఉగ్రవాద కుట్రను భారత భద్రతా బలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయి.
అమృత్‌సర్ సమీపంలోని ప్రాంతంలో బీఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం),పంజాబ్ పోలీసులు కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి.
స్వాధీనం చేసుకున్న ఆయుధాలలో తుపాకులు,గ్రనేడ్లు వంటి ప్రాణాంతక ఆయుధాలున్నాయి.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల నడుమ ఈ ఆపరేషన్ కలకలం రేపింది.
ఈ ఆపరేషన్ ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం బీఎస్‌ఎఫ్ ఇంటెలిజెన్స్ వింగ్ అందించిన సమాచారం ఆధారంగా నిర్వహించారు.
పరిశీలనలో భాగంగా గుర్తించిన ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభమైంది.
వివరాలు
బంగ్లాదేశ్‌లోని కొన్ని ర్యాడికల్ గ్రూపులతో పాకిస్థాన్ సంబంధాలు
బీఎస్‌ఎఫ్,పంజాబ్ పోలీసులు సమన్వయంతో, వేగంగా స్పందించడంతో ఈ కుట్రను ముందే గుర్తించి అడ్డుకోవడం సాధ్యపడింది.
మరో వైపు, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా పాకిస్థాన్ ఐఎస్‌ఐ మళ్లీ తన కదలికలను ప్రారంభించినట్లు సమాచారం.
మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ అధికారంగా బాధ్యతలు చేపట్టిన తరువాత, ఢాకా-ఇస్లామాబాద్‌ల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలతో పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకి చెందిన అధికారులు, మిలిటరీ శక్తులు బంగ్లాదేశ్ నుంచి భారత్ సరిహద్దుల వైపు తరచూ కదలాడుతున్నారని సమాచారం.
అంతేకాకుండా,బంగ్లాదేశ్‌లోని కొన్ని ర్యాడికల్ గ్రూపులతో పాకిస్థాన్ సంబంధాలు పెంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
దీని ఫలితంగా బంగ్లా-భారత్ సరిహద్దు ప్రాంతాలలోని ర్యాడికల్ గుంపులను పాక్ ఉగ్ర కార్యకలాపాల కోసం వినియోగించే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
వివరాలు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పహల్గాం ఉగ్రదాడి
ఈ నేపథ్యంలో ముర్షిదాబాద్ వంటి సున్నితమైన సరిహద్దు ప్రాంతాలలో భద్రతా దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 22న పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దారుణ ఘటన కేవలం 10 నిమిషాల్లోనే చోటుచేసుకుంది.
నేరుగా పర్యాటకుల తలలపై కాల్పులు జరిపిన ఈ దాడి పాశవికత్వానికి పరాకాష్టగా నిలిచింది.
ఈ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింతగా తారాస్థాయికి చేరాయి.
వివరాలు
భారత్ పాక్‌తో ఉన్న దౌత్య సంబంధాలపై కీలక నిర్ణయాలు
ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ పాక్‌తో ఉన్న దౌత్య సంబంధాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇందులో భాగంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడమే కాకుండా, పాకిస్థాన్ పౌరులను తక్షణమే భారతదేశం విడిచిపెట్టి వెళ్తే మంచిదని ఆదేశించింది.
భారత్ తీసుకున్న ఈ చర్యల నేపథ్యంలో పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.