Page Loader
Pahalgam Attack: 'ఉగ్రవాదులు 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు'.. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో కీలక సాక్షి.. 
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో కీలక సాక్షి..

Pahalgam Attack: 'ఉగ్రవాదులు 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు'.. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో కీలక సాక్షి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2025
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గామ్ ఉగ్రదాడి దేశాన్ని మాత్రమే కాదు, ప్రపంచాన్ని కూడా కలవరపాటుకు గురి చేసింది. నలుగురు ఉగ్రవాదులు తుపాకులతో అక్కడి ప్రజలపై దాడికి దిగారు. మహిళలు,పిల్లల్ని వదిలేసి పురుషులను అతి దారుణంగా హత్య చేశారు. మొత్తం 26మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుతం ఈ దారుణ ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారిస్తోంది. దర్యాప్తు సమయంలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన స్థానికులను అదుపులోకి తీసుకున్నారు. సంఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న ప్రత్యక్ష సాక్ష్యులను కూడా విచారించారు. ఒక ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన వివరాల ప్రకారం,ఉగ్రవాదులు తమ హత్యా కార్యక్రమం పూర్తిచేసిన తర్వాత గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి ఆనందాన్ని వ్యక్తం చేశారని చెప్పాడు. తాను ఆ దృశ్యాలను స్వయంగా చూశానని అధికారులకు తెలియజేశాడు.

వివరాలు 

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు అరెస్ట్ 

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని బాట్కోట్ ప్రాంతానికి చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, హిల్ పార్క్ ప్రాంతానికి చెందిన బషీర్ అహ్మద్ జోథర్‌గా గుర్తించారు. ఈ రెండు ప్రాంతాలు పహల్గామ్‌ పరిధిలోనే ఉన్నాయి. విచారణలో నిందితులు ముగ్గురు ఉగ్రవాదుల వివరాలను అధికారులకు వెల్లడించారు. వారు లష్కరే తోయిబా (LeT)కి చెందిన పాకిస్తాన్ పౌరులని వెల్లడైంది. హిల్ పార్క్ ప్రాంతంలోని ఒక గుడిసెలో ఈ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంతోపాటు ఆహారం, ఇతర అవసరమైన మద్దతు కూడా అందించినట్లు అధికారులు గుర్తించారు. పర్వైజ్,బషీర్‌ను చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) 1967లోని సెక్షన్ 19 కింద అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

వివరాలు 

దర్యాప్తు సంస్థతో కీలక విషయాలు పంచుకున్న ప్రత్యక్ష సాక్షి

ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన సమాచారం ప్రకారం, 26 మందిని హత్య చేసిన అనంతరం ముగ్గురు ఉగ్రవాదులు వెళ్లిపోతుండగా అతడిని ఆపినట్టు చెప్పాడు. కల్మా చెప్పమని అడిగినట్టు చెప్పాడు. తన స్థానిక యాసతో మాట్లాడటాన్ని గమనించిన ఉగ్రవాదులు తనను వదిలేసినట్టు తెలిపాడు. ఆ తర్వాత ఉగ్రవాదులు సంతోషంతో నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్చినట్టు వివరించాడు. అదే సమయంలో పర్వైజ్, బషీర్ ఇద్దరూ కొండ పైభాగంలో నిలబడి ఉగ్రవాదుల వస్తువులను చూసుకుంటున్నారని వెల్లడించాడు. కాల్పులు ముగిసిన తర్వాత ముష్కరులు తమ వస్తువులు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పాడు.

వివరాలు 

నలుగురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్టు అనుమానిస్తున్న అధికారులు

ఈ దాడి ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగింది.అక్కడకు వచ్చిన పర్యాటకులపై ముష్కరులు దాడి చేశారు. మతవివక్షతో ఈ దాడిని చేశారని అధికారులు తెలిపారు.ముస్లిం వ్యతిరేకులుగా భావించి 26మంది అమాయకులను ఉగ్రవాదులు హత్య చేశారు. మొత్తం నలుగురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈనలుగురిలో ముగ్గురు పాకిస్తాన్‌కు చెందినవారిగా గుర్తించారు.వారిలో హషీమ్ ముసా అలియాస్ సులేమాన్,అలీ భాయ్ అలియాస్ తల్హా భాయ్,ఆసిఫ్ ఫౌజీ,అలాగే అనంతనాగ్‌కు చెందిన స్థానిక ఉగ్రవాది అబిద్ హుస్సేన్ థోకర్ ఉన్నట్టు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఈదాడికి ప్రతీకారంగా భారత్ మే 7న పాకిస్థాన్‌పై 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభించింది. ఆఆపరేషన్‌లో 100మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.పాకిస్థాన్‌లోని పలు వైమానిక స్థావరాలు కూడా ఆ దాడిలో నాశనం అయ్యాయి.