PM Modi: అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యం.. 70వేల మందికి ఆఫర్ లెటర్స్ అందజేత
నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ ఫెయిర్ కింద 70వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ అందించారు. ప్రధాని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్ గార్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అపాయింట్‌మెంట్ లెటర్స్ అందుకున్న యువకులను ఉద్ధేశించి ప్రధాని మాట్లాడారు. ఈ జాబ్ మేళాలు ఎన్డీఎ, బిజేపీ ప్రభుత్వానికి కొత్త గుర్తింపుగా మారాయన్నారు. రాబోయే 25 ఏళ్లలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ముద్రా యోజన కోట్లాది మంది యువతకు ఉపయోగపడిందని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిన్నరలో రోజ్‌గార్ మేళాల ద్వారా 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని గతేడాది ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే.
విపక్షాలపై మోదీ ఫైర్
అవినీతికి గత ప్రభుత్వాలు కేరాఫ్ అడ్రస్ గా మారాయని కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీ విమర్శించారు. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందని, ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. కొత్తగా నియామకమైన యువత రాబోయే 25 ఏళ్లలో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. గత 5 ఉపాధి మేళాల్లో ఇప్పటివరకూ 4.29 లక్షల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. నేడు దేశంలోని 43 చోట్ల ఉపాధి మేళాలు నిర్వహించారు.