Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు కొనసాగిస్తాం: ప్రధాని మోదీ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు పొడిగించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు మోదీ తెలిపారు. తాము అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల కేవలం 5 సంవత్సరాలలో 13.5 కోట్ల మందికి పైగా పేదరికం నుంచి బయటపడ్డారని మోదీ అన్నారు. పేదరికం నుంచి బయటపడిన వారే నేడు మోదీకి కోట్లాది దీవెనలు ఇస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీకి మోసం తప్ప ఏం తెలియదు: మోదీ
ప్రజలు ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తనకు మంచి నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తాయని మోదీ వివరించారు. కాంగ్రెస్ పార్టీపై కూడా మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి మోసం తప్ప ఏం తెలియదన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ పేదలను గౌరవించదని దుయ్యబట్టారు. పేదల బాధలు, బాధలు కాంగ్రెస్‌కు అర్థం కావని మోదీ పునరుద్ఘాటించారు. అందుకే కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నంత కాలం పేదల హక్కులను దోచుకుని తిని నాయకుల ఖజానాను నింపిందన్నారు. 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు.
మహాదేవ్ పేరును కూడా కాంగ్రెస్ వదిలిపెట్టలేదు: మోదీ
ఛత్తీస్‌గఢ్‌లో 'మహాదేవ్' బెట్టింగ్ యాప్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 'మహాదేవ్' పేరును కూడా వదిలిపెట్టలేదని ప్రధాని ఆరోపించారు. మహాదేవ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్లు చెల్లించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించిన ఒక రోజు తర్వాత.. మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను దోచుకునే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదన్నారు. ఆఖరికి 'మహాదేవ్' పేరును కూడా వదిలిపెట్టలేదన్నారు. రెండు రోజుల క్రితం రాయ్‌పూర్‌లో భారీగా సొమ్ము పట్టుబడింది. దీనిపై విచారణ చేపట్టిన ఈడీ భూపేష్ బఘేల్‌పై అభియోగాలు మోపింది.