భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా విమర్శలను తిరస్కరించిన కేంద్రం
అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా 'యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ 2022' నివేదికను విడుదల చేసింది. అయితే ఈ నివేదికలో భారత్‌లో మత స్వేచ్ఛ, మైనార్టీలపై దాడులను అమెరికా ప్రస్తావించింది. బీజేపీ మైనార్టీలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు ఈ నివేదికలో 28 సార్లు ప్రస్తావించింది. భారతదేశంలో మత స్వేచ్ఛపై అమెరికా తన నివేదికలో చేసిన విమర్శలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం తిరస్కరించింది. ఇది లోపభూయిష్టంగా ఉందని, పక్షపాతంగా ఉందని పేర్కొంది. దేశంలోని మైనారిటీల దాడులపై భారత్‌ను విమర్శిస్తూ అమెరికా నివేదికను విడుదల చేయడం ఇదే మొదటిసారి కాదు. అమెరికా నివేదికపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రతినిధి అరిందమ్ బాగ్చి అమెరికా నివేదికపై విచారం వ్యక్తం చేశారు.
అమెరికాతో భాగస్వామ్యాన్ని తాము విలువైనదిగా పరిగణిస్తాం: భారత్
కొంతమంది అమెరికా అధికారులు పక్షపాతంతో రూపొందించే ఇలాంటి నివేదికలు విశ్వసనీయతను కోల్పోతాయని ఎంఈఏ ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. అమెరికాతో భాగస్వామ్యాన్ని తాము విలువైనదిగా పరిగణిస్తామని చెప్పారు. తమకు ఆందోళన కలిగించే సమస్యలపై తన నిరసనను తెలియజేస్తామని చెప్పారు. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో మత స్వేచ్ఛ నివేదిక విడుదల కావడం, అందులో భారత్‌ను విమర్శించడం గమనార్హం.
నివేదిక ఏమి చెబుతుంది?
అమెరికా విడుదల చేసిన నివేదికలో భారతదేశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ముఖ్యంగా భారత్‌లో అధికార పార్టీ బీజేపీ నాయకులు చేసిన విద్వేష ప్రసంగాలను దాదాపు 28సార్లు ప్రస్తావించారు. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)ని 24 సార్లు, బజరంగ్ దళ్‌ను ఏడుసార్లు ఈ నివేదికలో ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు చేసిన విద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలను, విభజన ప్రకటనలను కూడా ఈ నివేదిక డాక్యుమెంట్ చేసింది. ముస్లింలను కాల్చివేయాలని బీజేపీ నాయకుడు హరిభూషణ్ ఠాకూర్ బచౌల్ చేసిన వ్యాఖ్యలను నివేదికలో పొందుపర్చింది. కేరళలో క్రైస్తవులు, ముస్లింలు నిర్వహించే రెస్టారెంట్లలో హిందువులు తినకుడదని మాజీ శాసనసభ్యుడు పీసీ జార్జ్ మాటలను ఈ నివేదిక కోట్ చేసింది.