
Weather: ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణ..అసలేమైంది?
ఈ వార్తాకథనం ఏంటి
ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగిసింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, కేరళ, మాహె, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల నుంచి రుతుపవనాలు వైదొలిగాయి. దక్షిణాదిలో గత రెండు రోజులుగా ముఖ్యమైన వర్షాలు లేకపోవడంతో రుతుపవనాలు వెళ్లిపోయినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సాధారణంగా ఈ సీజన్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగుతుంది. అయితే, ఈ సంవత్సరం రుతుపవనాలు అదనంగా ఒక నెల రోజుల పాటు కొనసాగాయి. గత 150 ఏళ్లలో ఈశాన్య రుతుపవనాలు ఇంత ఆలస్యంగా వెనుదిరిగిన మూడు సందర్భాల్లో ఇది ఒకటిగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
రాయలసీమలో 46 శాతం అధిక వర్షపాతం
గత ఏడాది అక్టోబర్ 15న ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఇవి దక్షిణాది ఐదు వాతావరణ సబ్‌డివిజన్లలో విస్తారమైన వర్షాలను తీసుకువచ్చాయి. ఈ సీజన్‌లో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో మొత్తం 9 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. వీటిలో ఆరు బంగాళాఖాతంలోనే అభివృద్ధి చెందగా, ఒకటి తీవ్ర తుపానుగా (దానా), మరొకటి తుపానుగా (ఫెయింజల్) మారాయి. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, యానాంలో 282.3 మిల్లీమీటర్లు, రాయలసీమలో 344.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమలో సాధారణ వర్షపాతం (236.4 మిల్లీమీటర్లు) కంటే 46 శాతం ఎక్కువ వర్షాలు పడ్డాయి.