Dengue: డెంగ్యూ ప్రభావం.. ఎపిడెమిక్‌గా ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటక ప్రస్తుతం డెంగ్యూ జ్వరాల ప్రభావంతో అతలాకుతలమవుతున్న విషయం తెలిసిందే. డెంగ్యూని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎపిడెమిక్‌గా ప్రకటించింది. ఈ సందర్భంగా కర్ణాటక ఎపిడెమిక్ డిసీజెస్ రెగ్యులేషన్ 2020ను సవరించేందుకు సంబంధిత నియమాలను రూపొందిస్తోంది. ఈ ఏడాది జనవరి నుండి జూలై వరకు 7,362 డెంగ్యూ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఏడుగురు మరణించారు. డెంగ్యూ రోగులకు వైద్యం అందించేందుకు ప్రతి ఆసుపత్రిలోని వార్డులో పది పడకలను ప్రత్యేకంగా కేటాయించారు.
డెంగ్యూ నివారణ చర్యలపై కార్యచరణను రూపొందించిన సీఎం
ఇక డెంగ్యూ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక కార్యాచరణను ప్రకటించారు. మురికివాడల్లో నివసించే ప్రజలకు దోమతెరలు అందజేయడం, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేశ్ ప్రకటన ప్రకారం, అన్ని శాఖలకు కఠినమైన ఆదేశాలు జారీ చేసి, డెంగ్యూ వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అనంతరం, ఇంటింటికి వెళ్లి సేవలు అందించేందుకు ఆశా వర్కర్లను, వాలంటీర్లను అందుబాటులో ఉంచారు. దోమల వ్యాప్తిని తగ్గించడం ద్వారా డెంగ్యూ వ్యాధిని నియంత్రించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.