
Flagpole: ఎర్రకోటపై ఎగిరే జెండా తాడుకి ప్రత్యేక చరిత్ర
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి ఏడాది ఆగస్టు 15న, దేశ రాజధాని న్యూ దిల్లీలోని ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాన మంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే, ఈ జెండాను ఎగురవేయడానికి ఉపయోగించే తాడు వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 1947లో జరిగిన తొలి స్వాతంత్ర్య దినోత్సవం,1950లో జరిగిన తొలి గణతంత్ర దినోత్సవం నుండి ఇప్పటివరకు ప్రతి ఏడాది,ఈ రెండు జాతీయ వేడుకల్లో జెండా ఆవిష్కరణ కోసం ఉపయోగించే తాడును ఢిల్లీలోని ఒకే కుటుంబం తరతరాలుగా తయారు చేసి సైన్యానికి అందిస్తోంది.
వివరాలు
స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు నెలల ముందే తాళ్ల తయారీ
ప్రస్తుతం ఆ కుటుంబానికి చెందిన ఐదో తరం ప్రతినిధి నరేశ్ జైన్ ఈ విషయాన్ని 'ఈటీవీ భారత్'తో పంచుకున్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. "మేము జెండా ఎగురవేయడానికి కావాల్సిన తాళ్లను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాం. స్వాతంత్ర్య దినోత్సవానికి సుమారు రెండు నెలల ముందు వాటి తయారీ ప్రారంభమవుతుంది. ఆగస్టు 15కు పక్షం రోజుల ముందు ఆర్మీ అధికారులు వచ్చి తాళ్లను స్వీకరిస్తారు. వేడుక పూర్తయిన తర్వాత, ఆ తాళ్లను ప్రభుత్వం ప్యాక్ చేసి తిరిగి పంపిస్తుంది. ఈ సేవకు గుర్తింపుగా సైన్యం ప్రశంసాపత్రం అందిస్తుంది" అని నరేశ్ జైన్ తెలిపారు.