మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడమే లక్ష్యం; కుకీ, మైతీ గ్రూపులతో కేంద్రం చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
కుకీ, మైతీ గ్రూపుల జాతి ఘర్షణలతో మణిపూర్ మూడు నెలలుగా హింస చెలరేగుతోంది. మిలిటెంట్ గ్రూప్‌లు చేస్తున్న విద్వంసానికి ఆ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు మణిపూర్ అంశంపై ప్రధాన ఎజెండాగా మారింది.
ఈ నేపథ్యంలో మణిపూర్‌లో శాంతిని నెలకొల్పే ఎజెండాతో బుధవారం కేంద్ర ప్రభుత్వం కుకీ, మైతీ గ్రూపుల నేతలతో చర్చలు జరిపింది.
ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) మాజీ అదనపు డైరెక్టర్ అక్షయ్ మిశ్రా సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్ (ఎస్ఓఓ) ఒప్పందం ప్రకారం కుకీ తిరుగుబాటు గ్రూపుల నాయకులతో సమావేశమయ్యారు.
మరో ఐబీ అధికారి, మైతీ గ్రూపుకు చెందిన కోఆర్డినేటింగ్ కమిటీ ఫర్ మణిపూర్ ఇంటెగ్రిటీ(COCOMI-సీఓసీఓఎంఐ)నాయకులతో చర్చలు జరిపారు.
మణిపూర్
హింసకు కుకీ గ్రూపులు బాధ్యత వహించాలి: సీఓసీఓఎంఐ
కేంద్రం జరుపుతున్న చర్చలపై మైతీ గ్రూపునకు చెందిన సీఓసీఓఎంఐ నాయకులు కీలక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న హింసకు కుకీ గ్రూపులు బాధ్యత వహించాలని, ప్రభుత్వం ఆ సమూహాలతో మాట్లొద్దని సూచించారు.
రాష్ట్రంలో హింస మొదలైనప్పటి నుంచి కుకీ గ్రూపులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
ప్రస్తుతం మణిపూర్‌లో కేంద్రం జరుపుతున్న చర్చలు రాజకీయ పరమైనవి కావని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలో శాంతిని నెలకొల్పే ఏకైక ఎజెండాతోనే చర్చలు జరుపుతున్నట్లు పెర్కొన్నారు. రాష్ట్రంలో వీలైనంత తొందరగా హింస ఆగకపోతే, తగ్గించే మార్గాలను కనుగొనడంపై దృష్టి సారించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.
అయితే ప్రస్తుతం కుకీలు చేస్తున్న ప్రత్యేక పరిపాలన డిమాండ్‌పై చర్చించడం లేదని కేంద్ర వర్గాలు తెలిపాయి.
మణిపూర్
మణిపూర్‌లో తగ్గుముఖం పట్టిన హింస: కేంద్ర ప్రభుత్వ వర్గాలు
మణిపూర్ రాష్ట్రంలో ప్రస్తుతం చెదురుమొదరు అల్లర్లు మినహా, హింస స్థాయి తగ్గుముఖం పట్టిందని కేంద్రం ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మణిపూర్ లోయలో బంకర్‌లను తొలగిస్తుండగా, పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవడంపై రాష్ట్రంలో హింస తగ్గింది అనడానికి నిదర్శనమని ప్రభుత్వం చెబుతోంది.
బంకర్లను కూల్చివేసేందుకు భద్రతా బలగాలు చేపట్టిన డ్రైవ్‌కు మైతీ వర్గం నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదని, సీఓసీఓఎంఐ నేతలు దీనికి మద్దతు కుడా ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే కుకీ గ్రూపులు మాత్రం ఈ డ్రైవ్‌ను వ్యతిరేకిస్తున్నాయి.
మణిపూర్
ప్రత్యేక పాలన కోసం కుకీ మిలిటెంట్ల డిమాండ్
ఇదిలా ఉంటే, కుకీ మిలిటెంట్లను సీఎం బీరెన్ సింగ్ తీవ్రవాదులతో పోల్చారు. దీనిపై కుకీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
దీంతో తమకు ప్రత్యేక పాలన కావాలనే డిమాండ్‌ను కుకీ గిరిజన సంఘాలు తెరపైకి తెచ్చాయి. అయితే మైతీ వర్గం మాత్రం ప్రత్యేక పాలన అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.
ఎందుకంటే ఇది మణిపూర్ సమగ్రతను దెబ్బతీస్తుందని మైతీ వర్గం చెబుతోంది. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న మైతీ కమ్యూనిటీ, మణిపూర్‌లోని కొండ ప్రాంతాలలో స్థిరపడేందుకు వీలు కల్పించే షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదాను డిమాండ్ చేస్తోంది.
మైతీలకు ఎస్టీ హోదా కల్పించడం వల్ల ఏజెన్సీలోని తమ భూమిని లాక్కుంటారని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.