'జీ20 సదస్సును అడ్డుకోండి'; కశ్మీరీ ముస్లింలకు ఖలిస్థానీ నేత పిలుపు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సుపై ఖలిస్థానీ నాయకుడు, సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్ లోయలో నివసిస్తున్న ముస్లింలు దిల్లీకి వెళ్లి జీ20 సమ్మిట్‌కు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.
దిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే.
8వ తేదీన అంటే శుక్రవారం ప్రార్థనల తర్వాత శిఖరాగ్ర సమావేశం జరిగే ప్రగతి మైదాన్‌కు కవాతుగా వెళ్లాలని కశ్మీర్ లోయ ప్రజలను ఆయన కోరారు.
అంతేకాకుండా దిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో ఖలిస్థానీ జెండాను ఎగురవేస్తానని వీడియో సందేశంలో హెచ్చరించారు.
దిల్లీ
దిల్లీ పోలీసులు అలర్ట్
గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వీడియో సందేశం నేపథ్యంలో దిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు భద్రతను కట్టుదిట్టం చేశారు.
దిల్లీలోని మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థానీ అనుకూల రాతలు రాసిన తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం.
ఇదిలా ఉంటే, ఎస్ఎఫ్‌జేతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఇద్దరే గురుపత్వంత్ సింగ్ ఆదేశాల మేరకు మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థానీ అనుకూల రాతలు రాసినట్లు అధికారులు వెల్లడించారు.
పశ్చిమ దిల్లీలోని పంజాబీ బాగ్, శివాజీ పార్క్, మాదిపూర్, పశ్చిమ్ విహార్, మహారాజా సూరజ్మల్ స్టేడియం, నాంగ్లోయ్ సహా మెట్రో స్టేషన్ల గోడలపై 'దిల్లీ బనేగా ఖలిస్థాన్' వంటి నినాదాలు నలుపు రంగులో స్ప్రే చేశారు.