Amberpet Flyover: అంబర్‌పేట్ ఫ్లైఓవర్ ప్రారంభం.. నగరవాసుల దశాబ్దాల కల నెరవేరింది!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరవాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అంబర్‌పేట్ ఫ్లైఓవర్ ఎట్టకేలకు వాహనాల రాకపోకలకు తెరుచుకుంది.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో మహాశివరాత్రి పండుగ నాటికి ఈ ఫ్లైఓవర్‌ను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.
దాదాపుగా పూర్తయిన ఫ్లైఓవర్, దాని కింద రోడ్డు నిర్మాణం, గ్రీనరీ, ఇతర సుందరీకరణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
అయినా నగరవాసుల ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరుగకముందే వాహనాల రాకపోకలకు అనుమతి మంజూరైంది.
Details
ప్రయాణికులకు ఊరట
అంబర్‌పేట్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఇంకా పెండింగ్‌లో ఉన్నా నిత్యం ట్రాఫిక్‌తో ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల కోసం రాకపోకలకు అనుమతి ఇచ్చేలా కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ ఫ్లైఓవర్ స్థానిక నివాసితులకే కాదు, వరంగల్ వెళ్లే వాహనదారులకు కూడా చాలా ఉపయోగపడనుంది.
దశాబ్దాలుగా ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యతో బాధపడుతున్న ప్రజలకు ఇది ఎంతో పెద్ద ఊరటగా మారింది.
ఫ్లైఓవర్ నిర్మాణంపై కీలక విషయాలు
మంగళవారం కిషన్ రెడ్డి అంబర్‌పేట్ ఫ్లైఓవర్ పనులను స్వయంగా పరిశీలించారు. గోల్నాక చర్చి నుంచి ఛే నంబర్, శ్రీ రమణ జంక్షన్లను కలుపుతూ 1.5 కిలోమీటర్ల పొడవునా ఈ ఫ్లైఓవర్ నిర్మించారు.
Details
ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులు
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం హయాంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేసినా ఛే నంబర్ - శ్రీరమణ చౌరస్తాల మధ్య ఉన్న శ్మశాన వాటికల కారణంగా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరకలేదు.
అంబర్‌పేట్ ఫ్లైఓవర్ పైభాగం పూర్తయినా, కింద ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణం ఇంకా కొనసాగుతోంది .
6 చోట్ల భూసేకరణ అవసరం కాగా, తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ఇంకా భూమిని జాతీయ రహదారుల శాఖకు అప్పగించాల్సి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
రూ.2.51 కోట్ల నష్టపరిహారం ఇప్పటికే మంజూరు అయినా భూమిని ఇంకా అప్పగించలేదని తెలిపారు.
ప్రభుత్వం భూసేకరణ పూర్తిచేసి, స్థలాన్ని అప్పగిస్తే పనులు త్వరగా చేసి, ఫ్లైఓవర్‌ను అధికారికంగా ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు.