Delhi: 36 ఏళ్ల నిషేధం తర్వాత మార్కెట్లో 'ది సైటానిక్ వెర్సెస్'
భారతీయ-బ్రిటిష్ ఆంగ్ల రచయిత సల్మాన్ రష్దీ రచించిన వివాదాస్పద నవల 'ది సైటానిక్ వెర్సెస్' 36 ఏళ్ల నిషేధం తర్వాత దిల్లీ రాజధానిలోని బహ్రిసన్స్ బుక్‌స్టాల్‌లో తిరిగి ప్రదర్శనకు వచ్చింది. ఈ పుస్తకాన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వం అక్టోబర్ 5, 1988లో నిషేధించింది. తాజాగా దిల్లీ హైకోర్టు ఈ కేసును క్లోజ్ చేయడంతో, 37 ఏళ్ల తర్వాత పుస్తకం తిరిగి హస్తినలో అందుబాటులో వచ్చింది. అయితే ఈ పుస్తకం కేవలం లిమిటెడ్ స్థాయిలో ప్రదర్శనలో ఉంచారు. 'ది సైటానిక్ వెర్సెస్' నవల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వివాదాలకు దారితీసింది. ముఖ్యంగా ముస్లిం దేశాల్లో దీనికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. రచయిత సల్మాన్ రష్దీపై అనేక హత్యా ప్రయత్నాలు జరిగాయి.
కేసును క్లోజ్ చేసిన న్యాయస్థానం
రచయిత ముస్లిం ప్రవచనాలను విమర్శించినందుకు 1989లో ఇరాన్ షియా ఇస్లామిక్ నాయకుడు అయాతొల్లాహ్ ఖొమెయినీ హత్యకు ఫత్వా జారీ చేశారు. నవల అనువాదకులు హితోషి ఇగరాషిని (జూలై 1991లో), అజీజ్ నేసిన్ (జూలై 1993లో) కూడా కత్తిపోట్లకు గురయ్యారు. అలాగే నవల పబ్లిషర్ విలియం నైగార్డ్‌పై కూడా 1993లో హత్యా ప్రయత్నం జరిగింది. ఇండియాతో పాటు అనేక ఇస్లామిక్ దేశాల్లో ఈ నవలను నిషేధించారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు నవంబర్‌లో విచారణ ముగించింది. ప్రభుత్వ అధికారులు సరైన వాదనలు వినిపించకపోవడంతో, న్యాయస్థానం ఈ కేసును క్లోజ్ చేసింది. దీంతో ఈ పుస్తకానికి తిరిగి విక్రయాల మార్గం సుగమమైంది.