జమ్ముకశ్మీర్ కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదు: సుప్రీంకోర్టుతో కేంద్రం
జమ్ముకశ్మీర్ కు కేంద్ర పాలిత హోదా శాశ్వత విషయం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై ఆగస్టు 31న సుప్రీంకోర్టు ముందు వివరణాత్మక సమాచారాన్ని ఉంచుతామని మంగళవారం తెలిపింది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం,జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికల ప్రజాస్వామ్యం ఎంతో ముఖ్యమని తెలిపింది. రాష్ట్ర హోదా పునరుద్ధరించడం ఎంతో కీలకమన్న ధర్మాసనం.. దీనికి సంబంధించి కేంద్రం వద్ద ఎటువంటి ప్రణాళిక ఉందని ప్రశ్నించింది. జమ్మూ కాశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా శాశ్వత విషయం కాదని లడఖ్‌కు సంబంధించినంత వరకు, దాని UT హోదా కొంతకాలం కొనసాగుతుంది, "అని మెహతా చెప్పారు.
రాష్ట్ర పునర్వవస్థీకరణను అంగీకరిస్తున్నప్పటికీ.. ప్రజాస్వామ్యం ముఖ్యం: సుప్రీం
అయితే, ఇందుకు సంబంధించి పూర్తి వివరణను ఆగస్టు 31న ధర్మాసనానికి తెలియజేస్తామని అన్నారు. రాష్ట్ర పునర్వవస్థీకరణ, ప్రత్యేక హోదా, రద్దు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ మెహతా దాఖలు చేసిన వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం.. జాతీయ భద్రత అంశం దృష్ట్యా రాష్ట్ర పునర్వవస్థీకరణను అంగీకరిస్తున్నప్పటికీ.. ప్రజాస్వామ్యం ముఖ్యం అని తెలిపింది. ప్రస్తుత పరిస్థితికి సరైన కాలపరిమితితో ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందంది. ఎప్పటిలోగా వాస్తవిక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తారో చెప్పాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతోపాటు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిలకు ప్రభుత్వ స్పందనను తెలియజేయాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.