'అదానీ-హిండెన్‌బర్గ్' వ్యవహారంపై దర్యాప్తుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు
అదానీ-హిండెన్‌బర్గ్ ఎపిసోడ్‌పై దర్యాప్తునకు సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. దర్యాప్తు చేసేందుకు రిటైర్డ్ జడ్జి ఏఎం సప్రే నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అంశంపై రెండు నెలల్లోగా నివేదికను అందించాలని ఆదేశించింది. నిపుణుల కమిటీలో ఓపీ భట్, జేపీ దేవ్‌ధర్, కేవీ కామత్, నందన్ నీలకేని, న్యాయవాది సోమశేఖర్ సుందరేశన్ ఉన్నారు. ఈ కమిటీ పెట్టుబడిదారుల అవగాహనను బలోపేతం చేయడానికి చర్యలను సూచిస్తుంది. హిండెన్‌బర్గ్ నివేదికలో నిజాలున్నాయా? అనే దానిపై దర్యాప్తు చేస్తుంది.
సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు
అదానీ-హిండెన్‌బర్గ్ ఎపిసోడ్‌పై కోర్టు జోక్యం, దర్యాప్తును కోరుతూ దాఖలైన నాలుగు పిటిషన్ల విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తాజాగా ఉత్తర్వులను ప్రకటించింది. గౌతమ్ అదాని నేతృత్వంలోని గ్రూప్ మోసం, స్టాక్ మానిప్యులేషన్ పాల్పడిందని అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నేపేథ్యంలో అదాని స్టాక్స్ భారీ స్థాయిలో పతనమయ్యాయి. దీంతో భారత స్టాక్ మార్కెట్లో రూ.లక్షల కోట్లు ఆవిరయ్యాయి.