LOADING...
Vishaka: విశాఖ స్టీల్‌ను సెయిల్‌లో విలీనం చేసే ప్రతిపాదన లేదు.. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడి
విశాఖ స్టీల్‌ను సెయిల్‌లో విలీనం చేసే ప్రతిపాదన లేదు.. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడి

Vishaka: విశాఖ స్టీల్‌ను సెయిల్‌లో విలీనం చేసే ప్రతిపాదన లేదు.. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
03:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)‌లో విలీనం చేయాలన్న ఎలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆదిత్య యాదవ్ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో సమాధానం ఇస్తూ, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.11,440 కోట్ల నిధులను అందించిందని తెలిపారు.

వివరాలు 

ఆంధ్రప్రదేశ్‌లో 13,321 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తి అయినా... 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వామిత్వ పథకంలో భాగంగా ఇప్పటివరకు 13,321 గ్రామాల్లో డ్రోన్ ఆధారిత భూ సర్వేలు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకూ ఒకటంటే ఒక ప్రాపర్టీ కార్డూ సిద్ధం కాలేదని పంచాయతీరాజ్‌శాఖ సహాయ మంత్రి ఎస్‌పీ సింగ్‌ భగేల్‌ పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఈ సర్వేల్లో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 1,352 గ్రామాలు, అనంతరంగా తిరుపతిలో 1,045 గ్రామాలు, విజయనగరంలో 950 గ్రామాలు ఉన్నట్లు వివరించారు. విశాఖపట్టణంలో మాత్రం కేవలం 85 గ్రామాల్లో మాత్రమే సర్వే జరిగినట్టు తెలిపారు. పల్నాడు జిల్లాలో 349 గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తైనదని చెప్పారు.

వివరాలు 

గ్రామ స్వరాజ్‌ పథకానికి రూ.316 కోట్ల ప్రణాళికకు ఆమోదం 

రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ వ్యవస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్‌జీఎస్‌ఏ (రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్) పథకానికి రూ.316.22 కోట్ల విలువైన ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు మంత్రి భగేల్‌ వెల్లడించారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఖర్చు చేయకుండా ఉంచిన రూ.15.33 కోట్ల నిధులు ఉన్నందున కొత్తగా నిధుల విడుదల జరగలేదన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన మొత్తం రూ.4.85 కోట్లుగా పేర్కొన్నారు. వచ్చే 2025-26 సంవత్సరానికి సంబంధించి 9 ప్రాజెక్టులు కేంద్రానికి సమర్పించబడినట్లు తెలిపారు.

వివరాలు 

ఏపీలో 714 రైతు ఉత్పత్తి సంఘాలు నమోదు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 714 ఎఫ్‌పీఓలు (రైతు ఉత్పత్తి సంఘాలు) నమోదు అయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ తెలిపారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు కేశినేని శివనాథ్,కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సంఘాలు ముఖ్యంగా ధాన్యం,పప్పుదినుసులు,కొబ్బరి,పసుపు,టమోటా,మామిడికాయ,మిరపకాయ, జీడిపప్పు తదితర పంటల ఉత్పత్తులకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. జిల్లాల వారీగా చూస్తే,ప్రకాశం,పల్నాడు జిల్లాల్లో 39 చొప్పున,అనంతపురం,వైఎస్సార్ కడపలో 38 చొప్పున సంఘాలు నమోదయ్యాయని చెప్పారు. విశాఖ జిల్లాలో కేవలం 4 ఎఫ్‌పీఓలు మాత్రమే ఉన్నట్టు తెలిపారు.మొత్తం 1.7లక్షల మందికి పైగా ఈ సంఘాలలో సభ్యత్వం కలిగినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఈక్విటీ గ్రాంట్‌ను 227సంఘాలు పొందాయని,వాటిలో కడప జిల్లాకు చెందినవి 23, ఏలూరుకు చెందినవి 20 అని వివరించారు.

వివరాలు 

ఉపాధి హామీ పథకం కింద ఏపీకి రూ.1,660 కోట్లు పెండింగ్ 

ఉపాధి హామీ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రూ.1,660.9 కోట్ల వేతన బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్‌ స్పష్టం చేశారు. అంతేకాక, ప్రధాని గ్రామీణ సడక్ యోజన (PMGSY) మూడవ దశలో భాగంగా ఏపీలో మొత్తం 3,203.94 కిలోమీటర్ల మేర రహదారులు, 412 మార్గాలు, 77 వంతెనలకు అనుమతి మంజూరైనట్లు ఆయన చెప్పారు.