
Supreme Court: జాతీయ భద్రత కోసం పెగాసస్ వాడితే తప్పేమీ లేదు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
2021లో పెగాసస్ స్పైవేర్ వివాదంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.
తాజాగా, ఈ వ్యవహారంపై మరోసారి విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం, కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత కోసం పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించడం తప్పు కాదని స్పష్టం చేసింది.
అయితే పౌర సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంటే మాత్రం ఇది గనుక చట్ట విరుద్ధమవుతుందని ధర్మాసనం పేర్కొంది.
జాతీయ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించి అంశాల్లో రాజీ పడే ప్రసక్తి లేదని కోర్టు తేల్చిచెప్పింది.
Details
భద్రతా సమస్యలపై మరింత అవగాహన అవసరం
ఇక పెగాసస్ స్పైవేర్ ఆరోపణలపై అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ చేసిన దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయలేమని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇది కూడా జాతీయ భద్రతకే సంబంధించిన అంశం కావడంతో ఆ నివేదికపై గోప్యత కొనసాగించాల్సిన అవసరముందని పేర్కొంది.
ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద చోటుచేసుకున్న ఉగ్రదాడిని దృష్టిలో ఉంచుకుని భద్రతా సమస్యలపై మరింత అవగాహన అవసరమని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు.
ఇది తమ తీర్పుకు ప్రాధాన్యతను కల్పించిందని తెలిపారు.
Details
300 మంది పైగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్
పెగాసస్ వివాదంపై అప్పట్లో 300 మందికి పైగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయినట్లు ఆరోపణలొచ్చాయి. అందులో 40 మంది జర్నలిస్టులు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు కూడా ఉన్నారు.
దీంతో సీనియర్ జర్నలిస్టులు ఎన్. రామ్, శశికుమార్, ప్రేమ్ శంకర్ ఝా, ఆర్కే సింగ్, ప్రాంజయ్ తకుర్తా, ఎస్.ఎన్ అబీదీ, ఇప్సా షతక్సి కలిసి 2021లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్‌లు స్వతంత్ర విచారణ కోసం వేర్వేరుగా రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటి మీద విచారణల అనంతరం ఈరోజు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.