Raithu Runamafi: రేపు మూడో విడత రుణమాఫీ.. 14 లక్షల మందికి లబ్ధి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన రూ.2లక్షలలోపు రుణమాఫీ తుది విడత చెల్లింపునకు డేట్ ఫిక్స్ అయింది. స్వాతంత్య్ర దినోత్సవ రోజున ఖమ్మం జిల్లా వైరాలో మూడో విడత రైతు రుణమాఫీ నిధులను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రెండు విడతల్లో రైతు రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసిన విషయం తెలిసిందే. మొదటి విడతలో లక్షలోపు రుణాలు, రెండో విడతలో లక్షన్నర రుణాలను మాఫీ చేశారు.
నిధుల జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి
రైతుల ఖాతాల్లో నిధుల జమ చేసేందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. దాదాపు 14 లక్షల మందికి మూడో విడత రైతు రుణమాఫీ అమలు చేయనున్నారు. హైదరాబాద్‌లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముగిశాక సీఎం వైరాకు వెళ్లి అక్కడ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తారు. తర్వాత జరిగే బహిరంగ సభలో రుణమాఫీ నిధులు విడుదల చేయనున్నారు. తెలంగాణలో 11,34,412 మందికి రూ.6034 కోట్లను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెల్లించడం గమనార్హం.