Page Loader
PM Modi: 'భారత్‌కు రావడానికి ఇదే సరైన సమయం': పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ వ్యాపారులను ఆహ్వానించిన  మోదీ 
భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ వ్యాపారులను ఆహ్వానించిన  మోదీ

PM Modi: 'భారత్‌కు రావడానికి ఇదే సరైన సమయం': పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ వ్యాపారులను ఆహ్వానించిన  మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2025
08:25 am

ఈ వార్తాకథనం ఏంటి

2047 నాటికి భారత్‌ను వికసిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా, దేశంలో వ్యాపారాల పెరుగుదలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 14వ ఇండియా-ఫ్రాన్స్‌ సీఈవో ఫోరంలో ప్రసంగించిన మోదీ, ఈ సమావేశాన్ని ఇరుదేశాల అత్యుత్తమ వ్యాపారవేత్తల సంగమంగా అభివర్ణించారు.

వివరాలు 

భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 

"మీరు అందరూ ఆవిష్కరణ, సహకారం, సమీకరణ మంత్రంతో పనిచేస్తున్నట్టు నేను గమనిస్తున్నాను. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మీరూ భాగస్వాములు అవుతున్నారని నాకు గర్వంగా ఉంది. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో కలిసి ఈ సమ్మిట్‌కు అధ్యక్షత వహించడం సంతోషంగా ఉంది. గత రెండేళ్లలో ఇది మా ఆరో సమావేశం. గత ఏడాది మా రిపబ్లిక్ డే వేడుకలకు మెక్రాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈరోజు మేమిద్దరం కలిసి ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు నాయకత్వం వహించాం. గత దశాబ్దంలో భారత్‌లో అమలైన సంస్కరణలు మీకు తెలుసు.స్థిరమైన,ఊహాజనిత విధానాలను నెలకొల్పాం.త్వరలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది.రక్షణ రంగంలో 'మేక్ ఇన్ ఇండియా,మేక్ ఫర్ ది వరల్డ్'కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నాం,"అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

వివరాలు 

ఏఐ వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గవు 

ప్రస్తుతం ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. మంగళవారం పారిస్‌లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగాలు పోతాయన్న భయాలను ఖండించారు. "టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పూర్తిగా అదృశ్యం కావు. అవి తమ రూపాన్ని మార్చుకుంటాయి. కొత్త తరహా ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి. చరిత్ర కూడా ఇదే చెబుతోంది. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, భద్రత, సమాజాన్ని ఏఐ ప్రభావితం చేస్తోంది. 21వ శతాబ్దపు మానవతావాదానికి ఇది కోడ్ రాస్తోంది," అని మోదీ అన్నారు.

వివరాలు 

అమెరికా పర్యటన - ట్రంప్‌తో భేటీ 

ఈ సందర్భంగా, తదుపరి ఏఐ యాక్షన్ సమ్మిట్‌ను భారత్‌లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అలాగే, ఏఐ ఫౌండేషన్, కౌన్సిల్ ఫర్ సస్టెయినబుల్ ఏఐ ఏర్పాటుకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లనున్నారు.అక్కడ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది.ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ ఆయనను తొలిసారి కలుసుకోనున్నారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు,వాణిజ్య విధానాలు,ఆర్థిక సహకారం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల ట్రంప్ కొన్ని దేశాలపై టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో,మోదీ అమెరికా పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. భారత్-అమెరికా వ్యాపార సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ భేటీ కీలకంగా మారనుంది.