Narendra Modi: జమ్మూ కాశ్మీర్‌ని ఆ మూడు పార్టీలు నాశనం చేశాయి : ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జమ్ముకశ్మీర్ లోని దోడాలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మూడు కుటుంబాలు తమ వంశపారంపర్య రాజకీయాల ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఈ మూడు కుటుంబాలు, జమ్మూ కాశ్మీర్ యువత మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో కొత్త నాయకత్వం ఎదగడానికి ఈ పార్టీలను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.
అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు
2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత, పంచాయతీ ఎన్నికలు, బీడీసీ ఎన్నికలు, డీడీసీ ఎన్నికలు జరిగాయని, వీటితో జమ్మూ కాశ్మీర్‌లో యువతకు నాయకత్వం వచ్చే అవకాశం కల్పించామన్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో రాహుల్ గాంధీ బృందం ఒక భారతీయ జర్నలిస్టును అవమానించిందని ఆరోపించారు. యూపీఏ-2 హయాంలో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే లాల్ చౌక్ వెళ్లడానికి భయపడ్డారన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశానికి అనధికారిక కర్ఫ్యూ వంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరగబోయే తొలి అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో నిర్వహించనున్నారు. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.