
Nehru Zoo: నెహ్రూ జూపార్కులో అందుబాటులోకి రానున్న టైగర్ గ్లాస్ ఎన్‌క్లోజర్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో టైగర్ గ్లాస్ ఎన్‌క్లోజర్‌ను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మొదటిగా తెల్లపులిని గ్లాస్ ఎన్‌క్లోజర్‌లో ఉంచి సందర్శకులకు దగ్గరగా వీక్షించే అవకాశం కల్పించనున్నారు.
అనంతరం సింహాలు, పెద్దపులులకూ ఇలాంటి అద్దాల గదులను నిర్మించేందుకు జూ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
ఈ నేపథ్యంలో సందర్శకులను ఆకట్టుకునే ఇతర ప్రాజెక్టులపైనా నెహ్రూ జూ యాజమాన్యం దృష్టిసారించింది.
టన్నెల్ అక్వేరియం, ఏవియరీ, 9డీ వర్చువల్ డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ వంటి ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
వివరాలు
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో..
ప్రస్తుతం నెహ్రూ జూ పార్క్‌కు రోజుకు సగటున 30,000 మంది సందర్శకులు వస్తున్నారు.
కొత్త ప్రాజెక్టులు పూర్తయితే ఈ సంఖ్య రోజుకు 50,000కి పెరిగే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
గుజరాత్‌లోని వన్‌తార వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ఇప్పటికే గ్లాస్ ఎన్‌క్లోజర్ ఉంది.
అదే తరహా వినూత్న అనుభూతిని హైదరాబాద్ వాసులకు అందించాలనే ఉద్దేశంతో నెహ్రూ జూలోనూ గ్లాస్ ఎన్‌క్లోజర్‌ను నిర్మించనున్నారు.
టన్నెల్ అక్వేరియం:
పార్క్‌లోని ఒక ఎకరం స్థలంలో సముద్రపు జీవులతో కూడిన టన్నెల్ అక్వేరియం నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో ఉన్నట్లే, ఇది కూడా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో (PPP మోడల్‌లో) చేపట్టనున్నారు.
వివరాలు
పక్షుల మధ్య విహారయాత్ర:
దేశీయ, విదేశీ పక్షుల మధుర గీతాల మధ్య సంచరిస్తూ, వాటికి ఆహారం అందిస్తూ ఆసక్తికర అనుభూతిని పంచే ఏవియరీ నిర్మాణాన్ని కూడా PPP మోడల్‌లో చేపట్టనున్నారు. ఇది సందర్శకులకు ప్రకృతితో మమేకమయ్యే గొప్ప అవకాశాన్ని అందించనుంది.
9డీ వర్చువల్ అనుభవ కేంద్రం: హైదరాబాద్‌లోని బొటానికల్ గార్డెన్‌లోని మాదిరిగా, జూ పార్కులోనూ 9డీ సిమ్యులేటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
360 డిగ్రీల కోణంలో జంతు ప్రదర్శనను తిలకించేలా డిజిటల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను నెలకొల్పేందుకు నెహ్రూ జూ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.