Tihar jail: తీహార్ జైలు వార్డెన్ కనుసన్నల్లో మాదక ద్రవ్యాల తయారీ ఫ్యాక్టరీ
దిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని గ్రేటర్ నోయిడాలో ఎన్‌సీబీ అధికారులు నిషేధిత మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా మెథాంపెటమైన్ (మెథ్) తయారీ ల్యాబ్‌ను గుర్తించారు. ఈ వ్యవహారం వెనుక తిహాడ్ జైలు వార్డెన్ హస్తం ఉందన్న సమాచారంతో అధికారులు నిర్ఘాంతపోయారు. అక్టోబర్ 25న నిర్వహించిన దాడిలో, ఒక ఇంట్లో నిర్వహిస్తున్న ఈ మెథ్ ల్యాబ్‌ను గుర్తించారు. ఈ ల్యాబ్‌ను తిహాడ్ జైలు వార్డెన్, దిల్లీకి చెందిన వ్యాపారవేత్త, ముంబైకి చెందిన కెమిస్ట్ కలిసి నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వాణిజ్య కేంద్రంలో దేశీయ వినియోగానికి, అంతర్జాతీయ ఎగుమతులకు అవసరమైన సింథటిక్ డ్రగ్స్‌ను తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు 95 కిలోల మెథ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వార్డెన్‌తో పరిచయం.. మత్తు వ్యాపారంలోకి
ఫ్యాక్టరీ ఆవరణలో ఎసిటోన్, సోడియం హైడ్రాక్సైడ్, మిథాలిన్ క్లోరైడ్,ప్రీమియం గ్రేడ్ ఎథనాల్,రెడ్ పాస్ఫరస్,ఈథైల్ ఎసిటేట్ వంటి రసాయనాలు లభ్యమయ్యాయి. తయారీ కోసం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొన్న పరికరాలు కూడా అక్కడ ఉన్నాయి. ఈ వ్యవహారంలో పట్టుబడిన బిజినెస్ మాన్ ను గతంలో ఒక ఎన్డీపీఎస్ కేసులో డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. అతడిని తిహాడ్ జైలులో ఉంచినప్పుడు,అక్కడి వార్డెన్‌తో పరిచయం పెంచుకొని,అతడిని ఈ మత్తు వ్యాపారంలోకి దించాడు. ఈ ఫ్యాక్టరీలో ముంబయికి చెందిన కెమిస్ట్ మాదక ద్రవ్యాలను తయారు చేయగా,వాటి నాణ్యతను దిల్లీలో ఉండే మెక్సికన్ ముఠా సభ్యుడు పరీక్షిస్తున్నట్లు ఎన్‌సీబీ తెలిపింది. గతంలో ఎన్‌సీబీ గుజరాత్‌లోని గాంధీ నగర్,అమ్రేలి,రాజస్థాన్‌లోని జోధ్‌పుర్,సిరోహి,మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ డ్రగ్ ల్యాబ్‌లను కనుగొన్నారు.