Yadadri Temple: తిరుమల లడ్డూ వివాదం.. యాదాద్రి ఆలయంలో నెయ్యి నాణ్యతపై పరీక్షలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు లభ్యమయ్యాయి. దీంతో హిందువుల మనోభవాలు దెబ్బతిన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రం కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించాయి. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ కంపెనీకి టీటీడీ నెయ్యి సరఫరా చేస్తుండగా, నెయ్యిలో జంతు కొవ్వు కల్తీ కంట్రోవర్సీపై షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తిరుమల నెయ్యి వివాదం నేపథ్యంలో యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. యాదాద్రి ఆలయంలో ప్రసాదం కోసం వినియోగించే నెయ్యి శాంపిల్స్‌ను హైదరాబాద్ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు.
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీరియస్
ప్రస్తుతం ఆలయానికి మదర్ డెయిరీ ద్వారా నెయ్యి సరఫరా జరుగుతోంది. అదే నెయ్యితో లడ్డూ, పులిహోర వంటి ప్రసాదాలు తయారవుతున్నాయి. నెయ్యి టెస్టుల ఫలితాల ఆధారంగా లడ్డూ తయారీకి సంబంధించి తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక తిరుమల లడ్డూ నెయ్యి వివాదంపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే నెయ్యిని ల్యాబ్ పరీక్షల కోసం పంపించామన్నారు. లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు ఉందని నిర్ధారణకు వచ్చామన్నారు. గత ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన చెప్పారు.