
Tirumala dairy : రూ.40కోట్ల మోసం.. తిరుమల డెయిరీ చెన్నై ట్రెజరీ మేనేజరు ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల డెయిరీకి చెన్నైలో ట్రెజరీ మేనేజర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, విశాఖపట్టణం ప్రాంతానికి చెందిన 37ఏళ్ల బొలినేని నవీన్ చెన్నై మాధవరంలోని తిరుమల డెయిరీలో ట్రెజరీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. కంపెనీలో నిర్వహించిన లెక్కలు పరిశీలనలో నవీన్ సుమారు రూ.40కోట్ల మోసానికి పాల్పడ్డట్టు గుర్తించారు. ఈ విషయాన్ని అంగీకరించిన నవీన్,ఒక్క రోజులోనే నగదు చెల్లిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, వాస్తవంగా ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వలేకపోయిన నవీన్ చెన్నై పుళల్ ప్రాంతంలోని బ్రిటానియానగర్‌లో ఉన్న తన స్వంత షెడ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ చర్యకు ముందు నవీన్ తన సోదరీమణులకు ఈ-మెయిల్ పంపినట్లు తెలుస్తోంది.
వివరాలు
లీగల్ మేనేజర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు
వెంటనే వారు చెన్నై వచ్చి చూడగా ఆత్మహత్య చేసుకొని కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందులో ఐదుగురు అధికారులు తనను బెదిరించడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఈ-మెయిల్‌లో పేర్కొన్నట్లు సమాచారం. తిరుమల డెయిరీలో జరిపిన ఆడిటింగ్‌లో బొలినేని నవీన్ ట్రెజరీ మేనేజర్‌గా పనిచేస్తూ రూ.40 కోట్ల మోసానికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు గత నెల 24న చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్‌కు కంపెనీ లీగల్ మేనేజర్ మొహ్మద్ తమిముల్ అన్సారి ఫిర్యాదు చేశారని పోలీసులు పేర్కొన్నారు. అయితే నవీన్ అవసరమైన పత్రాలు సమర్పించకపోవడంతో అతన్ని విచారణకు పిలవలేదని పోలీసులు తెలిపారు.
వివరాలు
బెయిల్ పిటిషన్‌పై కోర్టులో రెండుసార్లు విచారణ వాయిదా
ఇక నవీన్ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో రెండుసార్లు విచారణ వాయిదా పడిందని చెప్పారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం నవీన్ తన సోదరికి, అలాగే తిరుమల కంపెనీకి ఈ-మెయిల్ పంపిన తరువాత ఉరివేసుకుని మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఆత్మహత్యకు ముందుగా పంపిన ఈ-మెయిల్‌లో పోలీసులపై ఎటువంటి ఆరోపణలు లేవని స్పష్టం చేశారు.