
Tirupati: ప్రపంచస్థాయి సదుపాయాలతో తిరుపతి రైల్వే స్టేషన్
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతి రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించేందుకు కార్యాచరణ చేపడుతున్నారు.
వికసిత్ భారత్ పథకం కింద చేపట్టిన ఈ అభివృద్ధి పనులు పూర్తి అయితే, రోజుకు సుమారు లక్షన్నర మంది ప్రయాణికులు మరింత సౌకర్యంగా, వేగంగా రాకపోకలు సాగించగలుగుతారు.
ఇప్పటికే 2022 జూన్‌లో రూ.300 కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్‌కు దక్షిణ దిశలో ప్రవేశ ద్వారం కలిగిన కొత్త భవనం, ఉత్తర వైపు ప్రవేశ ద్వారం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం దక్షిణ వైపున ఉన్న నూతన భవన నిర్మాణ పనులు సుమారు 70 శాతం వరకు పూర్తయ్యాయి.
ఈ భవనాన్ని వచ్చే మే లేదా జూన్ నాటికి ప్రయాణికుల వినియోగానికి అందుబాటులోకి తేచే అవకాశం ఉంది.
Details
మూడో అంతస్తులో రన్నింగ్ రూమ్
దక్షిణ వైపున నిర్మిస్తున్న ఈ భవనం జీ+3 అంతస్తులతో ఉండనుండగా, దాదాపు 9,261 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 200 కార్లు, 500 ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు బేస్‌మెంట్ నిర్మిస్తున్నారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లో టికెట్ కౌంటర్లు, వెయిటింగ్ లాంజ్ ఏర్పాటు చేస్తున్నారు.
రెండో అంతస్తులో ఓపెన్ ఏరియాలో కామన్ వెయిటింగ్ హాల్, మహిళల కోసం ప్రత్యేకంగా వెయిటింగ్ ఏరియా, ఫుడ్‌కోర్టులు, మరుగుదొడ్లు, క్లాక్‌రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు.
మూడో అంతస్తులో రన్నింగ్ రూమ్, టీటీఐ విశ్రాంతి గదులు, స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు.
Details
విమానాశ్రయాన్ని తలపించేలా అత్యాధునిక సౌకర్యాలు
ఈ తరహా సౌకర్యాలు ఉత్తర దిశలో కూడా కల్పించనున్నారు.
రైల్వే స్టేషన్‌లో దక్షిణం, ఉత్తరం వైపు భవనాలను అనుసంధానించే విధంగా విమానాశ్రయాన్ని తలపించే ఆకర్షణీయమైన కాన్‌కోర్స్‌ను రూపొందించారు.
ఈ కాన్‌కోర్స్ కింద ఆరు ప్లాట్‌ఫాంలు ఉండగా, పైభాగం నుండి ప్రతి ప్లాట్‌ఫారానికి ఎస్కలేటర్లు, లిఫ్టులు, మెట్లు ఏర్పాటు చేశారు.
సంబంధిత రైలు స్టేషన్‌లోకి వచ్చేవరకు ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కాన్‌కోర్స్‌పై లభ్యమవుతాయి.