
Tamilnadu: వివాహేతర సంబంధం అనుమానంతో..నడిరోడ్డుపై తమిళనాడు మహిళ కౌన్సిలర్ దారుణ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాష్ట్రంలోని అవది జిల్లాలో ఒక విషాదకర ఘటన జరిగింది. విదుతలై చిరుతైగల్ కట్చి(VCK)కు చెందిన మహిళా కౌన్సిలర్ గోమతిని,ఆమె భర్త స్టీఫెన్ రాజ్ అత్యంత దారుణంగా నరికి హత్య చేశాడు. గోమతికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో స్టీఫెన్ రాజ్,నడిరోడ్డుపైనే కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపాడు. ఈ హృదయవిదారక సంఘటన తిరునిన్రావూర్ ప్రాంతంలోని జయరామ్ నగర్ సమీపంలో చోటుచేసుకుంది. గోమతి ఒక పురుషుడితో మాట్లాడుతుండగా స్టీఫెన్ రాజ్ అక్కడికి వచ్చాడు. దంపతులు ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలై ఘర్షణగా మారింది. అకస్మాత్తుగా స్టీఫెన్ రాజ్ కత్తితో తన భార్య కౌన్సిలర్ గోమతి పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్రమైన గాయాల వల్ల గోమతి సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది.
వివరాలు
తమిళనాడులో వరుస హత్యల కలకలం
ఈ క్రూర ఘటన తర్వాత, నిందితుడు స్టీఫెన్ రాజ్ తానే హత్య చేశానని ఒప్పుకుంటూ తిరునిన్రావూర్ పోలీస్ స్టేషన్‌కు స్వయంగా వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో వరుస హత్యలు ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం, ఓ సెక్యూరిటీ గార్డు అయిన అజిత్ కుమార్ పోలీస్ కస్టడీలో మృతి చెందిన సంఘటన రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అతనిపై శారీరక హింస జరిగిందని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఇక జూన్ 30న, చెన్నైలోని పొన్నేరి ప్రాంతంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
వివరాలు
తమిళనాడులో దాదాపు 345 హత్యలు
కట్న వేధింపులు తాళలేక 22 ఏళ్ల మహిళ లోకేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి సమయంలోనే చాల కానుకలు ఇచ్చినప్పటికీ, మరలా 70 లక్షల రూపాయల విలువ గల కారును కొనివ్వాలని భర్త, అత్త, మామ లు ఒత్తిడి చేయడంతో ఆమె తీవ్ర మనోవేదనతో ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి పరిణామాల్లో తాజాగా అవది ఘటన మరింత కలకలం రేపింది. కౌన్సిలర్ గోమతిని ఆమె భర్త నడిరోడ్డుపై హత్య చేయడం అందరిని తీవ్రంగా షాక్‌కు గురిచేసింది. 2025 ప్రారంభం నుండి మొదటి త్రైమాసికంలోనే తమిళనాడులో దాదాపు 345 హత్యలు నమోదవడం గమనార్హం. ఈ వరుస హత్యలు రాష్ట్రంలో భద్రత పై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.