
Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగి ముగ్గురు మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్ రెండు రోజులుగా కుండపోత వర్షాల ధాటికి విలవిలలాడుతోంది.
పశ్చిమాసియాలో ఏర్పడిన వాతావరణ ప్రతికూలతల వల్ల రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు ముప్పుతిప్పలు పెట్టుతున్నాయి.
వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. రాంబన్ జిల్లా పరిస్థితి అత్యంత దారుణంగా మారింది.
అక్కడ వరుసగా విరిగిపడుతున్న కొండచరియల కారణంగా సుమారు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
వరద ఉధృతికి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, సుమారు 100 మందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసినట్టు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Details
సహాయక చర్యలకు తీవ్ర అటంకం
భారీ వర్షాలతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు వెల్లడించారు.
కొండ చరియల ధాటికి ప్రధాన రహదారులు మూసుకుపోయాయి. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయినట్టు సమాచారం.
ఇటీవలి ఐదేళ్లలో ఇంత తీవ్ర స్థాయిలో వర్షాలు, గాలులు తాకిన సందర్భం ఇదే తొలిసారి. దీంతో సంబంధిత శాఖలు హైఅలర్ట్ జారీ చేశాయి.
ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదని సూచించారు.
రాంబన్‌లో భారీ ఆస్తినష్టం సంభవించిందని తెలిపారు. సహాయక బృందాలు విపత్తు ప్రాంతాల్లో ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.