UttarPradesh: ప్రాణాల మీదికి తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై ప్రాణాలు కోల్పోయిన కుటుంబం
సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి చేసే ప్రయత్నాలు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈసారి రీల్స్ చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్ లో ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. రైలు పట్టాలపై రీల్స్ చేయడానికి ప్రయత్నించిన వారు, అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మరణించారు. ఈ దుర్ఘటనలో భార్యాభర్తలు, వారి కుమారుడు చనిపోయారు. పోలీసులు, బంధుమిత్రుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సీతాపూర్ జిల్లాలోని లహర్‌పూర్‌కు చెందిన మహ్మద్ అహ్మద్ (26), నజ్రీన్ (24) భార్యాభర్తలు. వీరికి అబ్దుల్లా అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. హర్గవ్ సమీపంలోని క్యోతి అనే గ్రామంలో జరిగిన శుభకార్యానికి అహ్మద్ తన కుటుంబంతో హాజరయ్యాడు. బుధవారం ఉదయం ముగ్గురు సమీపంలోని రైలు పట్టాల వద్దకు వెళ్లారు.
లక్నో నుండి మైలానికి వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో..
ఈ కుటుంబానికి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసే అలవాటు ఉంది. రైల్వే బ్రిడ్జి దగ్గర బైక్‌పై వెళ్లి, రైలు పట్టాలపై రీల్స్ చేస్తున్నారు. రీల్స్ లోకంలో మునిగిన వారు వెనుకాల రైలు వస్తున్న విషయం గమనించలేదు. ఈ సమయంలో లక్నో నుండి మైలానికి వెళ్తున్న ప్యాసింజర్ రైలు వారిని ఢీకొట్టడంతో, ముగ్గురు కూడా అక్కడికక్కడే మరణించారు. రైలు ఢీకొట్టడంతో వారి శరీరాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రమాద సమయంలో రీల్స్ తీసుకుంటున్నట్లు సెల్‌ఫోన్‌లో నమోదైన వీడియోల ద్వారా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.