Travel influence: రీల్స్ చేస్తుండగా ప్రమాదం.. జలపాతంలో పడి ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ సమీపంలోని కుంభే జలపాతంలో పడి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆన్వీ కామ్‌దర్ మరణించారు. 26 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్ షూటింగ్ చేస్తుండగా 300 అడుగుల లోతైన లోయలో పడి ప్రమాదానికి గురైంది. జూలై 16న ఆన్వీ తన ఏడుగురు స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు వెళ్లింది. జులై 17న ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వీడియో చిత్రీకరిస్తుండగా లోతైన గుంటలోకి జారిపోయింది.
ఆరు గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత బయటకు..
సమాచారం అందించిన అధికారులు, సంఘటన జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. కోస్ట్ గార్డ్‌కు చెందిన సచ్ కోలాడ్ రెస్క్యూ టీమ్, మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డ్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆరు గంటల పాటు శ్రమించి అన్వీని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. విహారయాత్ర.. విషాదంగా మారడంతో స్నేహితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్ మరణం తరువాత,తహసీల్దార్, మనగావ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో సహా స్థానిక అధికారులు పర్యాటకులకు, పౌరులకు ఒక విజ్ఞప్తిని జారీ చేశారు. సహ్యాద్రి శ్రేణులను సందర్శించేటప్పుడు ప్రతి ఒక్కరూ పర్యాటకాన్ని బాధ్యతాయుతంగా ఆస్వాదించాలని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు.