Page Loader
Greenfield Highway: కేవలం ఆరు గంటల్లో విశాఖ నుంచి రాయ్‌పుర్‌.. వచ్చే ఏడాది హైవే మొత్తం అందుబాటులోకి
కేవలం ఆరు గంటల్లో విశాఖ నుంచి రాయ్‌పుర్‌.. వచ్చే ఏడాది హైవే మొత్తం అందుబాటులోకి

Greenfield Highway: కేవలం ఆరు గంటల్లో విశాఖ నుంచి రాయ్‌పుర్‌.. వచ్చే ఏడాది హైవే మొత్తం అందుబాటులోకి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2025
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం నుంచి ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌కు కేవలం ఆరు గంటలలో చేరుకునేలా యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం దశలవారీగా వేగంగా ముందుకుసాగుతోంది. ప్రస్తుతం విశాఖ నుంచి రాయ్‌పుర్‌కు చేరాలంటే సాలూరు, కోరాపుట్, జయపుర మార్గం గానీ, లేదా బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ మార్గం గానీ ఎంచుకోవాల్సి వస్తోంది. ఏ మార్గం అయినా దాదాపు 12 నుండి 13 గంటల ప్రయాణ సమయం పడుతోంది. ఇప్పుడీ రెండు నగరాల మధ్య సులువుగా రాకపోకలు సాగించేలా 464 కిలోమీటర్ల పొడవుతో ఆరు లైన్ల యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎకనామిక్‌ కారిడార్‌ నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే ప్రయాణ సమయం సగానికి తగ్గిపోనుంది.

వివరాలు 

ఏపీలో పని ముగింపు దశలో 

ఈ హైవే విశాఖపట్నం శివారులోని సబ్బవరం వద్ద కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఇది విశాఖపట్నం,విజయనగరం, మన్యం పార్వతీపురం జిల్లాల మీదుగా సాగుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తంగా 18ప్యాకేజీలుగా విభజించబడింది: ఏపీలో 100కి.మీ. నాలుగు ప్యాకేజీలు,ఒడిశాలో 241కి.మీ.తో 11 ప్యాకేజీలు,ఛత్తీస్‌గఢ్‌లో 124కి.మీ. మూడు ప్యాకేజీలుగా విభజించారు. ప్రస్తుతం ఏపీ పరిధిలో 90 శాతం పనులు పూర్తయ్యాయి.అయితే ప్యాకేజీ 2, 3, 4లో భూసేకరణలో తలెత్తిన సమస్యల కారణంగా సుమారు 2.5 కి.మీ.మేర పనులు నిలిచిపోయాయి. భూమి సంబంధిత కోర్టు కేసుల వల్ల ఈ ప్రాంతాల్లో భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు. ఈసమస్యలు పరిష్కారమైతే వచ్చే జూన్ నాటికి ఏపీ పరిధిలో మొత్తం 100 కి.మీ.ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి రానుంది.

వివరాలు 

రూ.3,000 కోట్ల వ్యయం, టంప్రెట్‌ ఇంటర్‌ఛేంజ్‌ హైలైట్ 

ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్యాకేజీలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయితే, మొత్తం ప్రాజెక్టు వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీ రాష్ట్ర పరిధిలో 100 కి.మీ. హైవే నిర్మాణానికి సుమారు రూ.3,000 కోట్లు ఖర్చవుతున్నాయి. ప్రత్యేకంగా సబ్బవరం వద్ద ఈ హైవే కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిలో కలిసే ప్రాంతంలో టంప్రెట్‌ ఇంటర్‌ఛేంజ్‌ను నిర్మిస్తున్నారు. ఇది ఈ హైవేకు కీలకంగా మారనుంది.

వివరాలు 

కేవలం ఆరు ప్రవేశ ద్వారాలే - చిన్న వాహనాలకు నో ఎంట్రీ 

విశాఖపట్నం-రాయ్‌పుర్‌ యాక్సెస్‌ కంట్రోల్‌ హైవే పూర్తిగా ఆరు వరుసల రహదారిగా రూపుదిద్దుకుంటోంది. దీనిలో సర్వీస్‌ రోడ్లు ఉండవు. రాష్ట్ర పరిధిలో కేవలం ఆరు ప్రాంతాల్లోనే ఈ హైవేలోకి ప్రవేశించేందుకు,బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బైకులు, ఆటోలు వంటి చిన్న వాహనాలకు ఇందులో ప్రవేశం అనుమతించబడదు. ఈ హైవే ప్రారంభమైతే ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు విశాఖపట్నం పోర్ట్‌ నుంచి నేరుగా, వేగంగా కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. ఇది లాజిస్టిక్స్‌, వ్యాపారాభివృద్ధికి బలంగా మారే అవకాశం ఉంది.