Page Loader
PM Modi: అమెరికాలో ఒకసారి ఆగాలంటూ,మోదికి  ట్రంప్ ఆహ్వానం..  తిరస్కరించిన ప్రధానమంత్రి  
అమెరికాలో ఒకసారి ఆగాలంటూ,మోదికి ట్రంప్ ఆహ్వానం.. తిరస్కరించిన ప్రధానమంత్రి

PM Modi: అమెరికాలో ఒకసారి ఆగాలంటూ,మోదికి  ట్రంప్ ఆహ్వానం..  తిరస్కరించిన ప్రధానమంత్రి  

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్తాన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు.అంతర్జాతీయ వేదికపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో మోదీ పాక్‌ను ఎండగట్టారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాకిస్థాన్‌కు తరచూ బహుమతులు లభిస్తోన్నాయంటూ చురకలు అంటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు చేపట్టిన పోరాటంలో ఏవిధమైన ద్వంద్వ నిబంధనలు ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. కానీ వాస్తవంగా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని బహిరంగంగా ప్రోత్సహిస్తున్న దేశాలకు వరుసగా ప్రోత్సాహకాలు అందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమ్మిట్ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ క్రొయేషియా పర్యటనకు బయలుదేరారు.

వివరాలు 

డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ ప్రత్యక్ష భేటీ

వాస్తవానికి జీ7 సమావేశాల నేపథ్యంలో మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రత్యక్ష భేటీ ఉండాల్సి ఉంది. దీనికి సంబంధించి పలు కీలక అంశాలను ప్రధాని ముందుగానే సిద్ధం చేసుకున్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి, పాకిస్తాన్‌తో యుద్ధం, అలాగే "ఆపరేషన్ సిందూర్" అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సమావేశం రద్దైంది. కారణం - ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరగడమే. ఈ నేపథ్యంలో ట్రంప్ తన జీ7 పర్యటనను అర్థాంతరంగా ముగించి స్వదేశానికి బయలుదేరారు. అక్కడ యుద్ధంపై అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. అందుకే మోదీతో నేరుగా భేటీ అయ్యే అవకాశం కుదరలేదు.

వివరాలు 

ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి కారణాలు

అయినా కూడా, ప్రధాని మోదీ ట్రంప్‌తో ఫోన్ ద్వారా సుమారు 35 నిమిషాల పాటు మాట్లాడారు. ట్రంప్‌కు ఫోన్ ద్వారా అన్ని అంశాలపై వివరించారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి ఉన్న కారణాలు వెల్లడించారు. ఈ సంభాషణల వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు తెలియజేశారు. పాక్‌తో యుద్ధం కొనసాగించాలా? నిలిపివేయాలా? అన్న విషయంపై భారత్ ఎవరినీ సంప్రదించలేదని, తామెప్పుడూ మధ్యవర్తిత్వాన్ని కోరలేదని మోదీ స్పష్టంగా చెప్పినట్లు మిస్రీ తెలిపారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరగలేదని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

"ఇంకోసారి కలుద్దాం"

అదే సమయంలో, కెనడాలో జరిగిన సమావేశం ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో అమెరికాలో ఒకసారి ఆగాలంటూ, ప్రధానిని ట్రంప్ ఆహ్వానించారు. వైట్ హౌస్‌లో కెనడాలో రద్దైన ముఖాముఖి సమావేశాన్ని నిర్వహిద్దామని సూచించారు. కానీ ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా తిరస్కరించారు. ముందుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాల కారణంగా తాను అమెరికాకు రావడం సాధ్యపడదని తెలిపారు. "ఇంకోసారి కలుద్దాం" అని సమాధానమిచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 అమెరికాలో ఒకసారి ఆగాలంటూ, ప్రధాని మోదికి  ట్రంప్ ఆహ్వానం