ఛత్తీస్‌గఢ్ లో ఎన్నికల వేళ డిప్యూటీ సీఎంగా టీఎస్ సింగ్ నియామకం
ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత టీఎస్ సింగ్ డియోకు ఊహించని పదవి చిక్కింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రిగా సింగ్‌దేవ్ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిపాదననను ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించారు. మరో 4 నెలల్లోనే ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కీలక సమయంలో పార్టీలో వర్గపోరును రూపుమాపేందుకు అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా కొనసాగుతున్న టీఎస్ సింగ్‌దేవ్‌ను డిప్యూటీ సీఎంగా నియమించాలని ఏఐసీసీ భావించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
అప్పట్లో వాగ్వాదాలు, ఇప్పుడు పదవీ ప్రమాణ స్వీకారాలు
తాజా నిర్ణయంతో సీఎం భూపేష్ బఘేల్, టీఎస్ సింగ్ డియోల మధ్య పాత వివాదాలన్నీ ముగిసిపోయి సయోధ్య కుదిరింది. త్వరలో సింగ్‌దేవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు 2013 అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో డియో రాష్ట్రంలోనే అత్యధిక ఆస్తులతో సంపన్న ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. తన ఆస్తులు రూ.500 కోట్లకు పైగా ఉన్నాయని అంబికాపూర్ ఎమ్మెల్యే దేవ్ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దేవ్ ప్రజాదరణతో 2018లో కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించడంలో కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.అప్పట్లో బీజేపీ ప్రభుత్వంపై నిరసనలు ప్రదర్శించే నాయకుల్లో దేవ్ తొలి వరుసలోనే ఉండేవారని పేరుంది. గతేడాది జులైలో బఘేల్, సింగ్‌దేవ్‌ల వాగ్వాదం దిల్లీకి చేరింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ప్రమోషన్ కల్పించారని టాక్.