Page Loader
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చార్జీలు త‌గ్గింపు
టీఎస్ఆర్టీసీలో రిజర్వేషన్ ఛార్జీలు తగ్గింపు

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చార్జీలు త‌గ్గింపు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 26, 2023
07:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలోని సుదూర ప్రాంతాల ప్ర‌యాణికులకు ఆర్థిక భారాన్ని త‌గ్గించేందుకు ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ రేట్లను యాజమాన్యం తగ్గించింది. ఈ మేరకు రిజ‌ర్వేష‌న్ స‌దుపాయ‌మున్న ఎక్స్ ప్రెస్, డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జ‌రీ, ఏసీ బస్సు స‌ర్వీసుల్లో చార్జీల‌ను త‌గ్గిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎక్స్ ప్రెస్, డీల‌క్స్ స‌ర్వీసుల్లో 350 కిలోమీట‌ర్ల లోపు ప్రయాణానికి రూ.20, 350 కిలోమీట‌ర్ల‌ కంటే ఎక్కువగా ఉంటే రూ.30గా రుసుములను నిర్ణ‌యించింది. సూప‌ర్ ల‌గ్జ‌రీ, ఏసీ సర్వీసుల్లో మాత్రం ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటే రూ.30 వ‌సూలు చేయ‌నున్నట్లు సంస్థ వెల్లడించింది. సవరించిన ఛార్జీలు వెంటనే అమల్లోకి వస్తాయని సంస్థ పేర్కొంది.

DETAILS

మంగళవారం రోజు ఒకరి రక్తదానం - ముగ్గురికి ప్రాణదానం పేరిట బ్లడ్ క్యాంప్ : టీఎస్ఆర్టీసీ  

టీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో సగటున 15 వేల వ‌ర‌కు ప్రతిరోజూ టికెట్ల‌ను రిజ‌ర్వేష‌న్ చేసుకుంటున్నారని వివరించింది. రిజ‌ర్వేష‌న్ చార్జీల‌ తగ్గింపు కారణంగా ఈ సౌకర్యాన్ని ప్ర‌యాణికులంద‌రూ ఉప‌యోగించుకోవాలన్నారు. అలాగే సంస్థ‌ను ఆద‌రించాలని ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్, ఎండీ వీసీ స‌జ్జ‌నార్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు రక్తదానంపై సంస్థ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 101 ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం ర‌క్త‌దాన శిబిరాల‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. 'ఒకరి రక్తదానం - ముగ్గురికి ప్రాణదానం' అనే ట్యాగ్ లైన్‌తో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. మానవత్వంతో స్పందించి రక్త దానం చేసేందుకు ముందుకు రావాలని సంస్థ కోరింది. ప్రతీ డిపో పరిధిలోని 20 నుంచి 30 మంది విద్యార్థులు రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.