TSRTC : సిటీలో రెండున్నర కోట్ల మహాలక్ష్మి ప్రయాణికులు.. బస్సుల సంఖ్యను పెంచే యోచనలో టీఎస్ఆర్టీసీ
టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. గతంలో ప్రతిరోజూ 9 నుంచి 10 లక్షల ప్రయాణాలు మాత్రమే ఉండేది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబరు 9 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ప్రయాణికులు అనూహ్యంగా ఇబ్బడిముబ్బడిగా పెరిగారు. ప్రస్తుతం రోజూవారీగా 18 లక్షల మంది గ్రేటర్ పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇందులో మహిళా ప్రయాణికుల సంఖ్యే అత్యధికంగా ఉందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజూవారీ ప్రయాణికుల డేటా : డిసెంబర్ 9కి ముందు : ఒక్కరోజులో సగటున 10 లక్షల ప్రయాణాలు డిసెంబర్ 9 తర్వాత : దాదాపు 18 లక్షల ప్రయాణాలు
బస్సుల సంఖ్యను పెంచేందుకు ఆర్టీసీ కృషి
ఉచిత ప్రయాణాలు ప్రారంభమైన నాటి నుంచి దాదాపుగా 2.50కోట్ల మంది మహిళా ప్రయాణికులు సిటీ బస్సుల్లో గమ్యస్థానాలకు చేరారని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో బస్సుల సంఖ్య చాలట్లేదని ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. పలు చోట్ల మహిళా ప్రయాణికులు సీట్ల కోసం ఘర్షణ పడుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే బస్సుల సంఖ్యను పెంచుకోవాలని టీఎస్ఆర్టీసీ భావిస్తోంది. మరో 1100 బస్సుల కోసం సన్నాహాలు : మహానగరంలో ప్రస్తుతం 2850 బస్సులు నిత్యం తిరుగుతున్నాయి. ఈ బస్సులకు అదనంగా మరో 1100ల ప్రగతి రథాలు అవసరమని రవాణా శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో భాగంగానే 880 బస్సులు ఆగమేఘాల మీద సమకూర్చుకోవాలని నిర్ణయంచారు.
అద్దె ప్రాతిపదికన కోసం టెండర్లు
అయితే వీటిలో 540 బస్సులు మేర ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు కాగా,మరో 340 బస్సులు అద్దె ప్రాతిపదికన సమకూర్చుకునేందుకు టెండర్లను ఇటీవలే పిలిచారు. జనవరి 3న 340 బస్సులకు టెండర్ల గడువు ముగుస్తుందని అధికారులు పేర్కొన్నారు.ఇటీవలే ప్రీ బిడ్డింగ్ సమావేశం ఏర్పాటు చేయగా, దానికి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఫలితంగా ఈ ఏడాది జూలై నాటికి కొత్తగా 880 బస్సులు సమకూరుతాయని అధికారులు అంటున్నారు.అద్దె ప్రాతిపదికన బస్సులు తక్కువైతే సొంతంగా సమకూర్చుకోవాలని లెక్కలు వేస్తున్నారు. సర్వీసులు తగ్గకుండా.. కాలం చెల్లిన సిటీ బస్సులను ఏటా తుక్కు కింద 200బస్సుల వరకు తొలగించాల్సి వస్తోంది. ఇక జిల్లాల్లో తిరిగే డీలక్స్ బస్సులను నగరానికి తీసుకువచ్చి వాటిని సిటీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీగా రూపుదిద్దుతున్నారు.
880 బస్సుల కోసం సన్నాహాలు
ప్రతి సంవత్సరం ఇలా 200 బస్సులకు తక్కువ కాకుండా మార్చుతూ మహానగరం పరిధిలో ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గకుండా అధికారులు నెట్టుకొస్తున్నారు. అయితే ఈ బస్సులకు అదనంగా 880 బస్సులు జమైతే నగర జనాభాకు, ప్రయాణికుల అవసరాల మేరకు రవాణా ఏర్పాట్లు సజావుగా సాగుతాయని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఇక నగర శివార్లలో షార్ట్ ట్రిప్పులు వేసి విద్యార్థులకు ఆర్టీసీ సేవల కొరత లేకుండా సంస్థ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మేరకు టీఎస్ఆర్టీసీ(TSRTC) చర్యలు తీసుకుంటున్నారు. ఈ మాదిరిగా సిటీ బస్సుల సంఖ్యను పెంచేందుకు యాజమాన్యం చేపడుతున్న చర్యలతో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం అవుతుందని రవాణా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.