తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ లగేజీ నిర్వహణ
తిరుమల శ్రీవారి భక్తుల కోసం మరో కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు లగేజీ నిర్వహణ నిమిత్తం నూతన వ్యవస్థకు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే BBMS (బాలాజీ బ్యాగేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్)ను లాంచ్ చేసింది. లగేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు డిజిటలైజ్ చేయడం ద్వారా భక్తులకు సులభంగా, వేగంగా సేవలు అందించగలుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రయోగాత్మకంగా చేపట్టిన బీబీఎంఎస్ వ్యవస్థ విజయవంతమైందని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. అంతకుముందు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (CVSO) డి.నరసింహ కిషోర్‌తో కలిసి బీబీఎంఎస్ నిర్వహణపై సమీక్షించారు. ప్రస్తుతం బ్యాగేజీ నిర్వహణ చేసేందుకు మాన్యువల్ పద్ధతినే కొనసాగిస్తున్నామన్నారు. దీని స్థానంలో తాజాగా ఆధునిక పద్ధతిలో భాగంగా డిజిటలైజ్ చేస్తున్నట్లు తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం కొత్త వ్యవస్థను తీసుకొచ్చాం : ఈఓ ధర్మారెడ్డి
తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మొబైల్ ఫోన్లు, లగేజీ డిపాజిట్ కోసం బీబీఎంఎస్ పద్ధతిని ప్రవేశపెట్టామని ఈఓ ధర్మారెడ్డి వివరించారు. దర్శనానికి వెళ్లే ముందు భక్తులు జేబుల్లో దాచుకున్న ఫోన్ల జమ ప్రక్రియలో అవాంతరాలు ఏర్పడుతున్నట్లు ఆయన చెప్పారు. అందుకే సౌకర్యవంతం కోసం కొత్త వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దామన్నారు. నూతన విధానంలో దర్శన టిక్కెట్లను స్కాన్ చేస్తామని, దీంతో లగేజీ, ఫోన్ల వివరాలు ఆటోమేటిక్‌గా నిక్షిప్తం అవుతాయన్నారు. దర్శనం టిక్కెట్లు లేని వారి వస్తువులనూ స్కాన్ చేస్తామని, QR కోడ్ రసీదుతో RFID నెంబర్ ఇస్తామన్నారు. మొబైల్ డిపాజిట్ నిమిత్తం శ్రీవారి దర్శన టిక్కెట్లు సహా ఆధార్ డేటాను సేకరిస్తామని, ఈ మేరకు క్యూఆర్ కోడ్, రశీదు ఇస్తామని స్పష్టం చేశారు.