శ్రీవారి మ్యూజియానికి టీటీడీ భూమి పూజ.. రూ.145 కోట్లతో అత్యాధునిక భవనానికి శ్రీకారం
తిరుమల సన్నిధిలో ఎస్వీ మ్యూజియం నిర్మాణం కోసం పూజ భూమి జరిగింది. స్వామి వారి భక్తుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతికతతో కూడిన శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని నిర్మించేందుకు శుక్రవారం టీటీడీ పాలక మండలి శ్రీకారం చుట్టింది. దాదాపు రూ. 145 కోట్లతో ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులను ప్రారంభించినట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. టీసీఎస్(TCS) కంపెనీ, బెంగుళూరుకు చెందిన మ్యాప్ సిస్టమ్ సంస్థతో కలసి మ్యూజియాన్ని లేటెస్ట్ టెక్నాలజీతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పుణ్యకార్యానికి ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ రూ. 125 కోట్లు, మ్యాప్ సిస్టమ్ రూ 20 కోట్లను విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నిధులను వెచ్చించి డిసెంబరులోగా నిర్మాణం పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.
మ్యూజియంలో శ్రీవారి ఆలయ విశిష్టతలు, తిరుమలకు సంబంధించిన కీలక సమాచారం
మొత్తం ఈ భవనం మూడు ఫ్లోర్లలో ఉంటుందని, వాటిల్లో శ్రీవారి ఆలయ విశిష్టతలు, తిరుమలకు సంబంధించిన కీలకమైన సమాచారం తదితర అంశాలను ఏర్పాటు చేయనున్నామని టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ఛైర్మన్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారమే కార్యచరణకు దిగారు. ఈ మేరకు శ్రీవారి వైభవాన్ని చాటి చెప్పేలా వెంకటేశ్వర స్వామి పేరిట ఎస్వీ మ్యూజియంను ఏర్పాటు చేసేందుకు సంకల్పించారు. ఈ క్రమంలోనే టీటీడీ ఈఓ(EO) ధర్మారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. అంతకుముందు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.