Air India: ఎయిరిండియా విమానంలో ఆర్మ్‌రెస్ట్ కోసం కొట్టుకున్న ప్రయాణికులు..
ఎయిర్ ఇండియా విమానంలో రెండు సీట్ల మధ్య ఉన్న ఆర్మ్ రెస్ట్ కారణంగా ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగింది. డెన్మార్క్ నుంచి దిల్లీకి బయలుదేరిన ఫ్లైట్‌లో, ఎకానమీ తరగతిలో ఈ ఘర్షణ మొదట వాగ్వాదం రూపంలో ప్రారంభమైంది. పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించేందుకు క్యాబిన్ సిబ్బంది జోక్యం చేసుకుని, వారిలో ఒకరిని మరో సీటుకు మారుస్తూ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు.
ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్న ఇద్దరు ప్రయాణికులు..
అయితే, డిసెంబర్ 22, ఆదివారం ఉదయం విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత, కొత్త సీటుకు మారిన ప్రయాణికుడు తన లగేజ్ తీసుకోవడానికి పాత సీటు దగ్గరకు తిరిగి వచ్చాడు. ఈ సమయంలో, ఇరు ప్రయాణికుల మధ్య మరలా వాగ్వాదం చెలరేగి, అది పిడిగుద్దుల వరకు వెళ్లింది. ఆ వెంటనే విమాన సిబ్బంది మళ్లీ జోక్యం చేసుకుని గొడవను ఆపగలిగారు. చివరికి, ఇరువురు ప్రయాణికులు స్నేహపూర్వకంగా కరచాలనం చేసి విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లినట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.