Andhra Pradesh: ఏపీలో మరో రెండు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు.. టెండర్ల ప్రక్రియ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రెండు గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించింది.
ఇందులో ఒకటి రాజధాని అమరావతిలో, మరొకటి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ ప్రాజెక్టులకు సంబంధించి ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయనం నిర్వహించేందుకు, సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక (టీఈఎఫ్‌ఆర్) రూపొందించేందుకు కన్సల్టెన్సీ సంస్థలను నియమించేందుకు ఏపీఏడీసీ టెండర్లు ఆహ్వానించింది.
ఈ నెల 21 వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చి, 24న సాంకేతిక బిడ్‌లు, 27న ఫైనాన్షియల్ బిడ్‌లు తెరవనుంది.
Details
అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం
అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం కోసం అనుకూలమైన ప్రాంతాన్ని కన్సల్టెన్సీ సంస్థ సూచించాల్సి ఉంటుందని నిబంధనలలో పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని ప్రతిపాదిత విమానాశ్రయం నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో, సముద్రతీరానికి సమీపంలో ఏర్పాటు చేయనున్నారు.
ఈ విమానాశ్రయాల నిర్మాణం, నిర్వహణపై ప్రభావం చూపే సాంకేతిక, ఆర్థిక అంశాలను కన్సల్టెన్సీ సంస్థలు గుర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Details
ఆదాయాలు వచ్చే అవకాశం
తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా కాన్సెప్ట్ మాస్టర్‌ప్లాన్, ఫైనాన్షియల్ మోడల్, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ సిద్ధం చేయడంతో పాటు పర్యావరణ, సామాజిక ప్రభావ అధ్యయనాలు నిర్వహించాలని సూచించారు.
విమానాశ్రయ నిర్మాణానికి వ్యయ అంచనాలు, దశలవారీగా నిర్మాణ ప్రణాళిక, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం, జాయింట్ వెంచర్ వంటి అంశాలపై నివేదిక సిద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అలాగే ఈ ప్రాజెక్టుల ద్వారా ఎంత ఆదాయం వచ్చే అవకాశముందని అంచనా వేయాలని సూచించారు.
Details
మార్కెట్ డిమాండ్‌పై విశ్లేషణ
విమానాశ్రయాలున్న ప్రాంతాలను ఏవియేషన్ హబ్‌లుగా అభివృద్ధి చేయడానికి వైమానిక, రక్షణ రంగ తయారీ పరిశ్రమల అవకాశాలపై కన్సల్టెన్సీ సంస్థలు అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఏపీఏడీసీ పేర్కొంది.
భవిష్యత్తులో ఎయిర్ ట్రాఫిక్ వృద్ధి ఎలా ఉండబోతోందన్న అంశాలపై విశ్లేషణ చేసి, ప్రభుత్వం నుండి అవసరమైన ఆర్థిక, ఇతర ప్రోత్సాహకాలను సూచించాలని సూచించారు.
Details
35 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్‌ప్లాన్
విమానాశ్రయాల భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 35 ఏళ్లకు సరిపడే విధంగా కాన్సెప్ట్ మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని స్పష్టం చేశారు.
రన్‌వేలు, ట్యాక్సీవేలు ఎంత పొడవుగా ఉండాలి, ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్ స్టాండ్‌లు ఎన్ని అవసరం, ప్యాసింజర్, కార్గో టెర్మినళ్లు ఎలా ఉండాలి వంటి అంశాలన్నీ ఈ ప్రణాళికలో పొందుపరచాలని సూచించారు.
అలాగే, విమానాశ్రయాలకు ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పెంచే అవకాశం ఉండే విధంగా అనుబంధ నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన భూమి అంచనా వేయాలని ఏపీఏడీసీ స్పష్టం చేసింది.