టిక్కెట్ కోసం సీఎం జగన్‌ను 5 సార్లు కలిశా, అయినా ఫలితంలేదు : ఎమ్మెల్యే మేకపాటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఈ మేరకు వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. ఈ నెల 13న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర జరగనుంది. ఈ నేపథ్యంలో బద్వేలు నేతలను వెంటబెట్టుకుని లోకేశ్ ను కలిసిన మేకపాటి జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. బద్వేలు నియోజకవర్గం అట్లూరులో లోకేశ్ యువగళం పాదయాత్రకు మేకపాటి సంఘీభావం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో తాను, వెంకటగిరి నియోజకవర్గంలో ఆనం రాంనారాయణరెడ్డి లోకేష్ పాదయాత్రను జిల్లాలోకి ఆహ్వానిస్తామన్నారు.
టిక్కెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసమే పని చేస్తాం : మేకపాటి
పాదయాత్ర ఉదయగిరిలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో లోకేశ్ ను ఆహ్వానించాలనే వచ్చినట్టు మేకపాటి తెలిపారు. అయితే తన నియోజకవర్గంలో యువగళం పాదయాత్రను విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టిక్కెట్ కోసం ఐదు సార్లు కలిసినా ఫలితమేం లేదన్నారు. ఎమ్మెల్సీ పదవి మాత్రమే ఇస్తానని హామీ ఇచ్చారని వివరించారు. అందువల్ల చేసేదేం లేక పార్టీ నుంచి బయటికి వస్తున్నానని చెప్పుకొచ్చారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. తనతో పాటు నెల్లూరు జిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా నుంచి టికెట్ ఇస్తే పోటీ చేస్తానన్న మేకపాటి, ఒకవేళ టిక్కెట్ ఇవ్వకపోయినా సరే పార్టీ కోసమే పని చేస్తానని హామీ ఇచ్చారు.