ఉదయనిధి స్టాలిన్ సనాతన వ్యాఖ్యలపై స్పందించిన మోదీ.. కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం
తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. సనాతన ధర్మం అంశంపై సరైన రీతిలో ప్రతిస్పందించాలని కేంద్ర మంత్రులకు సూచించారు. దిల్లీలో G-20 శిఖరాగ్ర సమావేశానికి ముందు జరిగిన కేంద్ర మంత్రమండలి సమావేశంలో భాగంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం వివాదాస్పదంపై చరిత్రలోతుల్లోకి వెళ్లకుండా, రాజ్యాంగం మేరకు వాస్తవాలకు కట్టుబడి జవాబులివ్వాలని సూచించారు. సమకాలిక పరిస్థితులను జోడిస్తూ ఆచితూచి మాట్లాడాలని హితబోధ చేశారు. ఇండియా వర్సెస్ భారత్ వివాదంపై మాట్లాడవద్దని మంత్రివర్గ సహచరులను కోరారు. ఈ విషయంపై తగిన వ్యక్తి(అధికారిక ప్రతినిధి) మాత్రమే మాట్లాడాలని సూచనలు చేశారు.
బీజేపీ నా మాటలను వక్రీకరించింది : ఉదయనిధి స్టాలిన్
సనాతన ధర్మం డెంగీ, మలేరియా వంటిదని, దాన్ని పూర్తిగా నిర్మూలించాలని తమిళనాడు మంత్రి, డీఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతోంది. మరోవైపు తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని స్టాలిన్ ధ్వజమెత్తారు. ఈ మేరకు తన మాటలకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. సనాతన ధర్మం అననుసరించే వ్యక్తులపై హింసకు పాల్పడాలని తాను పిలుపు ఇవ్వలేదని వివరించారు. ఉదయనిధి స్టాలిన్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇండియా కూటమి, హిందూమతాన్ని ద్వేషిస్తోందని, ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని అమిత్ షా ఆగ్రహించారు. అన్ని మతాలను తాము సమానంగానే చూస్తామని కాంగ్రెస్ స్పష్టం చేయడం గమనార్హం.