Nutrition Security: న్యూట్రిషన్ సెక్యూరిటీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 17,082 కోట్లు కేటాయింపు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్ లో నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లోథల్ వద్ద ఈ హెరిటేజ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే, పంబాజ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రూ.4,406 కోట్ల వ్యయంతో సరిహద్దు రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం కింద రోడ్లు,టెలికామ్,నీటి సరఫరా,ఆరోగ్యం,విద్య అందించేందుకు ఆమోదం ఇచ్చారు. ఇక పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలకు కనెక్టయ్యేలా 2,208 కిలోమీటర్ల మేర రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో కొత్త రోడ్లను నిర్మించాలని నిర్ణయించారు.
ఫోర్టిఫైడ్ రైస్ ను సరఫరా చేసేందుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం
గ్రామాలను హైవేలతో కలపడం ద్వారా సరిహద్దు గ్రామాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను కేబినెట్ సిద్ధం చేసిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఐసీడీఎస్, పీఎం పోషణ సహా అన్ని పథకాల ద్వారా రూ.17,082 కోట్ల వ్యయంతో ఫోర్టిఫైడ్ రైస్ ను సరఫరా చేసేందుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రక్తహీనత, శరీరంలో మైక్రో-న్యూట్రియెంట్ల కొరతను అధిగమించడమే దీని ప్రధాన లక్ష్యమని చెప్పారు. 2028 డిసెంబర్ వరకూ ఈ పథకం అమలు అవుతుందని, ఇది పూర్తిగా కేంద్ర నిధులతోనే జరుగుతుందని తెలిపారు.
80 కోట్ల మందికి లబ్ధి
ఈ పథకం ద్వారా దేశంలో 80 కోట్ల మంది ప్రజలు పోషకాహార లోపాన్ని అధిగమించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై నీతియోగ్ పూర్తిగా పరిశోధన చేసిందని, మామూలు బియ్యంతోనే వీటిని తయారు చేస్తారని ఆయన చెప్పారు. 2019 నుంచి 2021 మధ్య దేశంలో నిర్వహించిన ఆరోగ్య సర్వేలో రక్తహీనత సమస్య అధికంగా ఉన్నట్లు తేలిందని, అన్నివయసుల వారిలో ఈ లోపం కనిపించిందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ వంటి లోపాలు కనిపించాయని వివరించారు. ఆ సర్వే ఆధారంగానే ఫోరిఫైడ్ రైస్ ను సరఫరా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.