Hardeep Singh Puri: సునీతా కేజ్రీవాల్ ని రబ్రీ దేవితో పోల్చిన కేంద్ర మంత్రి
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ వీడియో సందేశాన్ని విడుదల చేసిన వెంటనే బిజేపి విమర్శనాస్త్రాలను సంధించింది. సునీతా కేజ్రీవాల్‌ను బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవితో పోల్చారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ. తన భర్త పదవిని కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందంటూ ఆమెను టార్గెట్ చేశారు. ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ విలేఖరుల సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానంగా, మీరు పేరు తీసుకుంటున్న మేడమ్ బహుశా బీహార్‌లో రబ్రీ దేవిలా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారని అన్నారు.
వీడియో సందేశాన్ని విడుదల చేసిన సునీతా కేజ్రీవాల్
శుక్రవారం మరోసారి సునీతా కేజ్రీవాల్ తన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వీడియో సందేశంలో, సునీతా కేజ్రీవాల్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. సునీతా కేజ్రీవాల్ ఈ ప్రచారానికి ''బ్లెస్సింగ్స్ టు కేజ్రీవాల్' అని పేరు పెట్టారు. తన వీడియో సందేశంలో, ఆమె రెండు వాట్సాప్ నంబర్‌లను విడుదల చేశారు. ఆ వాట్సాప్ నంబర్లకు ప్రజలు తమ సందేశాలను పంపాలని విజ్ఞప్తి చేశారు. దేశం నలుమూలల నుండి ప్రజలు తమ సందేశాలను కేజ్రీవాల్‌కు పంపవచ్చని సునీతా కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నారు. దీంతో పాటు గురువారం రూస్ అవెన్యూ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ ధైర్యంగా తన అభిప్రాయాలను అందించారని తెలిపారు. ఇంత ధైర్యంగా కోర్టులో తన అభిప్రాయాలను ప్రదర్శించడం అంత సులువు కాదన్నారు.
దేశప్రజల మద్దతు కోరిన సునీతా కేజ్రీవాల్
కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. దేశంలోని అత్యంత అవినీతి, నియంతృత్వ శక్తికి తన భర్త సవాల్ విసిరారని సునీతా కేజ్రీవాల్ డిజిటల్ మీడియా సమావేశంలో అన్నారు. దీనితో పాటు, ప్రజలు తమ ఆశీర్వాదాలు , ప్రార్థనల ద్వారా తనను ఆదరించాలని కోరారు. అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం మార్చి 21న అదుపులోకి తీసుకుంది. గురువారం మరోసారి రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, తర్వాత కోర్టు అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీని ఏప్రిల్ 1 వరకు పొడిగించింది.